సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడే అయింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బీఆర్ఎస్ విజయభేరి మోగించింది. 39 స్థానాలకు ఏకంగా 27 స్థానాలను దక్కించుకొని, వరుసగా మూడోసారి గులాబీ జెండా ఎగురవేసింది. ఆది నుంచీ అండగా నిలుస్తున్న ఇక్కడి ప్రజానీకం, మరోసారి బీఆర్ఎస్కే పట్టం కట్టింది. అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా.. బెదిరింపులకు భయపడకుండా చెంపచెల్లుమనేలా తీర్పునిచ్చింది. వేలాది కోట్లతో సిరిసిల్లను సిరిలఖిల్లాగా మార్చి, వస్త్ర పరిశ్రమకు పునర్జీవం పోసి, అనేక సంక్షేమ పథకాలతో నేతన్నకు బతుకునిచ్చిన రామన్నకే జైకొట్టింది. ‘సిరిసిల్ల గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా’ అని మరోసారి నిరూపించింది.
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో ఉరిశాలగా మారిన సిరిసిల్లను స్వరాష్ట్రంలో అప్పటి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సిరులఖిల్లాగా మార్చారు. సిరిసిల్లను జిల్లాకేంద్రంగా మార్చి, అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపారు. వేలాది కోట్లతో వస్త్ర పరిశ్రమకు పునర్జీవం పోసి, అనేక సంక్షేమ పథకాలతో నేతన్నకు అడుగడుగునా అండగా నిలిచారు. బతుకమ్మ చీరలు, ప్రభుత్వ ఆర్డర్లు, ఇతర అనేక సంక్షేమ పథకాలతో కుటుంబాల్లో వెలుగులు నింపారు. దీనిని గుర్తించిన నేతన్నలు, సిరిసిల్ల ప్రజలు ఆది నుంచీ కేటీఆర్‌కు అండగా నిలుస్తున్నారు. ఎన్నికలు ఏవైనా జైకొడుతూనే ఉన్నారు. అయితే 2023తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, సిరిసిల్లలో కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా అనేక కుట్రలు చేసింది. గతంలో ఓ ఉన్నతాధికారిని ప్రయోగించి, బీఆర్ఎస్ను బద్నాం చేయడానికి ఒడిగట్టింది. అందులో భాగంగా నేతన్నలతోపాటు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ వేధించడం మొదలు పెట్టారు. పలువురు నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు కూడా పంపించారు. జిల్లెల్లలోని ఓ సామాన్య రైతును జైలుకు పంపడంతోపాటు సిరిసిల్లలోని ఫుట్‌పాత్‌పై కేటీఆర్ ఫొటో పెట్టుకుని నడిపిస్తున్న టీస్టాల్ కొట్టును తొలగించారు. ఇలా ఎన్నోరకాలుగా వేధింపులకు గురిచేసినా సిరిసిల్ల ప్రజలు మాత్రం రామన్న వెంటే నడిచారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో.. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే జైకొట్టారు.
ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ‘హస్తం’ నాయకులు అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేశారు. సిరిసిల్ల ప్రజలు నమ్మకుండా బీఆర్ఎస్కు పట్టం కట్టడంతో కాంగ్రెస్ నేతలు కంగుతున్నారు. తర్వాత మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో కుట్రలు పన్నారు. రెండేళ్లలో చేసిందేమీ లేకపోవడంతో మళ్లీ పాత పద్ధతిలోనే అసత్య ప్రచారాలకు ఒడిగట్టారు. అయితే ఎన్నికల్లో రామన్న మూడు రోజులపాటు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం, ఎక్కడికక్కడ ప్రజలు జైకొట్టడం చూసి కొత్త ఎత్తుగడలు వేశారు. ఆఖరికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు మూడు రోజుల పాటు తిష్టవేసి, నేతన్నలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. చివరికు ‘క్షమించు రామన్నా’ అంటూ ఓటరు, నేతన్నల పేరిట బోగస్ లేఖను సృష్టించి నమ్మించే ప్రయత్నం చేశారు. ఇటు ఎన్నడూ పట్టించుకోని బీజేపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా సిరిసిల్లకు వచ్చి హామీలతో మభ్యపెట్టేందుకు యత్నించారు. వీటన్నింటిని నిశితంగా పరిశీలించిన నేతన్నలు, గులాబీ జెండాకే పట్టం కట్టారు.
కేటీఆర్‌పై అక్కసుతో ఇక్కడి కాంగ్రెస్ నేత, ఓ ఉన్నతాధికారి కలిసి కుట్రలకు తెరలేపారు. అప్పటి వరకు బతుకమ్మ చీరలు, ప్రభుత్వ ఆర్డర్ల, చేతినిండా పనితో సంతోషంగా ఉన్న కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. బతుకమ్మ చీరల బిల్లులతోపాటు చీరల తయారీ, ప్రభుత్వ ఆర్డర్లను నిలిపివేశారు. వస్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టడంతోపాటు బతుకమ్మ చీరల ఆర్డ ర్లు అడిగితే నేతన్నలపై అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటినీ నేత కార్మికులు మరిచిపోలేకపోయారు. యజమానులు, ఆసాములను బెదిరించడం, ఆర్డర్లు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేయడం, బీఆర్ఎస్ అభ్యర్థులపై కేసులు పెట్టించడం వంటి కుట్రలను సిరిసిల్ల ప్రజలు తిప్పికొట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి చెంప చెల్లుమనిపించేలా తీర్పునిచ్చారు. బీఆర్ఎస్కు పట్టం కట్టి, అవమానించినోళ్లు, బెదిరించినోళ్లకు చెంప చెల్లుమనిపించేలా ఓటుతో బుద్ధి చెప్పారు.

సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ మంత్రులు, పెద్దలు వచ్చి ప్రచారం చేసినా.. ఆయా పార్టీల ముఖ్య నాయకులు ఓటమి పాలయ్యారు. 2వ వార్డులో బీజేపీ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌పై 220 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల రాములు గెలిచారు. అలాగే 12వ వార్డులో సిరిసిల్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు సతీమణి నిర్మలపై 43 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మొగిలి నాగరాజు విజయం సాధించారు. 3వ వార్డులో కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనితపై 296 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి జిందం కళ గెలుపొందారు. 15వ వార్డులో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు కోడలు దీపికపై బీఆర్ఎస్ అభ్యర్థి కూర భాగ్యలక్ష్మి గెలిచారు. 35 వవార్డులో కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు దుబాల వెంకటేశంపై 601 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల రమేశ్ విజయం సాధించారు.
హస్తం పార్టీ నాయకులు బెదిరింపులకు దిగినా.. ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా సిరిసిల్ల ప్రజలు మరోసారి రామన్నవైపే నిలిచారు. 2014, 2020 మున్సిపల్ ఎన్నికల్లో జైకొట్టినట్టే.. మూడోసారి కూడా భారీ విజయం అందించారు. సిరిసిల్లలోని మొత్తం 39 వార్డులకు 27 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 22 స్థానాలు కట్టబెట్టగా, ఈసారి మరో ఐదు స్థానాల్లో అదనంగా గెలిపించారు. కాంగ్రెస్ 6, బీజేపీ 5 స్థానాలకే పరిమితం కాగా, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం పొందారు. మొత్తంగా ఎన్నికలు ఏవైనా రామన్న వైపే ఉంటామని, సిరిసిల్ల బీఆర్ఎస్ కంచుకోట అని మరోసారి నిరూపించారు. కాంగ్రెస్, బీజేపీకి చెంపపెట్టు లాంటి తీర్పునివ్వడంతో నాయకులు సంబురాల్లో మునిగిపోయారు.