
అమీన్పూర్, జూలై 9 :సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. పట్టణాలు అభివృద్ధి బాట పడుతున్నాయి. పట్టణాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారంతో పాటు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. ఇందులో ప్రజలు భాగస్వామ్యులై స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తున్నారు. గ్రామ, పట్టణాభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులతో పాటు వీధుల శుభ్రత, మెరుగైన పారిశుధ్యం, వంటి కార్యక్రమాలతో పాటు శిథిల భవనాల కూల్చివేత, హరితహారంలో మొక్కలు నాటడం, పార్కుల ఏర్పాటు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు వంటి నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అమీన్పూర్ మున్సిపాలిటీలో ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయి. దీంతో మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజలతో మమేకమై అడిగి తెలుసుకోవడం, ఎక్కడ ఎటువంటి పనులు చేయాలనే ప్రణాళికలు తయారు చేయడంతో పనులు చకచకా జరిగిపోతున్నాయి.
సమస్యలపై అవగాహన
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, అధికారులు ప్రతి కాలనీ, గల్లీ తిరుగుతూ ప్రజా సమస్యలను పరిశీలించారు. ఏ కాలనీలో ఏ సమస్యలున్నాయి? ప్రజా అవసరాలు? తదితర వాటిపై పాలకవర్గం సభ్యులు ప్రణాళికలు రూపొందించారు. దానికి తగ్గట్టుగానే కాలనీల్లో రోడ్లు, మురికి కాల్వలు, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు, పారిశుధ్య నిర్వహణ, చెత్త తరలింపు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పురాతన భవనాల కూల్చివేతలు వంటి ఎన్నో సమస్యలను గుర్తించారు.
పచ్చలహారంగా..
పట్టణ ప్రగతి కార్యక్రమంలో హరితహారమే ప్రత్యేక పాత్ర పోషిస్తున్నది. అమీన్పూర్లో హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటారు. మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో పచ్చలహారంగా కనిపిస్తున్నది. నాటిన మొక్కలను సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మొదటి విడుతలో 1,22,250 మొక్కలతో ప్లాంటేషన్స్ చేశారు. ఇంటింటికీ 98,700 మొక్కలను పంపిణీ చేశారు. ట్రీగార్డులను ఏర్పాటు చేసి వాటిని రక్షిస్తున్నారు. రెండోవిడుతలో 80వేల మొక్కల వరకు నాటి, ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున అందజేశారు. భవిష్యత్ హరితహారం కోసం 5 నర్సరీల్లో లక్షలాది మొక్కలు పెంచుతున్నారు. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడానికి ఆయా కాలనీల్లో ప్రత్యేక కమిటీల ద్వారా అవగాహన కల్పి స్తూ మొక్కలను పెంచేలా ప్రోత్సహిస్తున్నారు.
మొదటి విడుత సాధించిన ప్రగతి..
పట్టణ ప్రగతిలో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో సుమారు రూ.3కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టారు. మొత్తం ఆరు వైకుంఠధామాలతో పాటు హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి మహా ప్రస్థానానికి దీటుగా సుమారు రూ.1.50కోట్లతో నవ్య కాలనీ రహదారిలో మహా ప్రస్థానాన్ని అభివృద్ధి చేశారు. మొదటి విడుతతో ప్రతిపాదన చేసి రెండో విడుత పట్టణ ప్రగతి వరకు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో హారితహారంలో భాగంగా పెద్ద ఎత్తున వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు నాటారు. ఐదు ఎకరాల్లో విశాలమైన మహాప్రస్థానం నిర్మిస్తున్నారు. వీటితో పాటు రెండు పెద్ద పార్కులను తయారు చేశారు. 11వ వార్డులోని జయలక్ష్మీనగర్కాలనీలో ఒకటి, 5వ వార్డులో మాధవపురి హిల్స్‌లో పార్కును నిర్మించారు. పిల్లల ఆట వస్తువులు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, వివిధ రకాలు పూల మొక్కలు, పెద్ద ఎత్తున గ్రీనరీ, దేశ రాజధానిలోని ఎర్రకోటను తలపించేలా అభివృద్ధి చేశారు.
వార్డు కమిటీల పాత్ర కీలకం..
అమీన్పూర్లో ఆయా కాలనీలు, ప్రాంతాల్లోని వారితో వార్డు కమిటీలు సమస్యలు తెలుసుకొని, అధికారులు, పాలకవర్గాల దృష్టికి తీసుకెళ్తున్నాయి. ఎక్కడ ఏ సమస్యలున్నాయి? అభివృద్ధి ఎలా చేయాలి? అనే దానిపై వార్డు కమిటీలు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. పట్టణ ప్రగతిలో కాలనీ ప్రజలను సహకారం తీసుకొని స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తున్నారు. కాలనీ సమస్యలు, అభివృద్ధి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకొని నివేదికలు పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకుంటున్నారు.