
పటాన్చెరు/ రామచంద్రాపురం, జూలై 4: “ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలి.” అని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి అన్నారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్చెరు మండల పరిధిలోని నందిగామ, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్లలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులుగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. నందిగామలో హరితహారం కార్యక్రమం ద్వారా పెద్దసంఖ్యలో మొక్కలు నాటడంపై స్థానిక ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు.
ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్లలో…
ఆర్సీపురం పరిధి శ్రీనివాసనగర్‌లోని మందుమూల ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పట్టణ ప్రగతిలో భాగంగా ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్థానిక కార్పొరేటర్ పుష్పానగేశ్‌తో కలిసి మామిడి, వేప మొక్కలు నాటారు. అదేవిధంగా భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డితో కలిసి మ్యాక్ సొసైటీలో మొక్కలు నాటి, పట్టణ ప్రగతి కోసం ఏర్పాటు చేసిన వాహనాలను ప్రారంభించారు.
పట్టణాల అభివృద్ధికి విశేష కృషి..
పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. వార్డులు, డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. అడవుల శాతాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. విడుతల వారీగా జరుగుతున్న పట్ణణ ప్రగతి, హరితహారంలో కార్యక్రమంలో ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆలయాల నిర్మాణానికి భూమిపూజ…
ఆర్సీపురం పరిధిలోని శ్రీనివాసనగర్‌లోని ఆంజనేయస్వామి దేవాలయం పక్కనే శివాలయం, రామాలయం నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ పుష్పనగేశ్ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా భూపాల్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడె మహిపాల్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు.
కంచర్లగూడెంలో విగ్రహ ప్రతిష్టాపన..
పటాన్చెరు మండలం భానూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కంచర్లగూడెంలో ఏర్పాటు చేసిన కేతకీ సమేత భ్రమరాంబ మల్లికార్జున స్వామి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మావేణుగోపాల్రెడ్డి, దేవానంద్, జడ్పీటీసీలు సుప్రజా వెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ ఉమావతి గోపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, ఆర్సీపురం కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ అంజయ్యయాదవ్, నాయకులు ఆదర్శ్‌రెడ్డి, మల్లేశ్, జగన్‌రెడ్డి, కుమార్‌గౌడ్, మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.