మెదక్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటన వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయమైన హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటం సమంజసమని, అయితే ఆ పోరాటంలో ప్రాణాలను కోల్పోవడం సరైంది కాదని స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని, ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సమస్యలు ఎంత పెద్దవైనా వాటికి పరిష్కారం ప్రాణాలు తీసుకోవడం కాదని, ధైర్యంగా నిలబడి పోరాడితేనే న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందన్నారు. శంకర్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.