అందోల్, నవంబర్ 4: తరుచూ ప్రమాదాలతో నాందేడ్- అకోలా జాతీయ రహదారి మృత్యుదారిగా మారింది. జోగిపేట నుంచి సంగారెడ్డి- హైదరాబాద్ వెళ్లేందుకు ఇది ప్రధాన మార్గం. నిత్యం ఈ దారి గుండా వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులు వామ్మో.. నాందేడ్- అకోలా రహదారా అంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ రోడ్డు గుండా నాందేడ్- అకోలా, ఢిల్లీ తదితర ప్రాంతాలకు భారీ వాహనాలు, కంటైనర్లు వెళ్తుంటాయి. సంగారెడ్డి, జోగిపేట, మెదక్, నారాయణఖేడ్ ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగస్తులు, వ్యాపారులు ఈ రోడ్డులో ప్రయాణిస్తుంటారు. జేఎన్టీయూ, పాలిటెక్నిక్‌తో పాటు మరెన్నో ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఈ మార్గంలోనే కార్లు, ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదాల్లో చాలావరకు వాహనాలను ఓవర్ టేక్ చేయబోతున్న సమయంలో జరిగినవేనని తెలుస్తున్నది. గతేడా ది మార్చిలో అల్మాయిపేట్ (బసనాగు) వద్ద ఆటో-కంటైనర్ ఢీకొని నలుగురు మృతిచెందారు. మరో ప్రమా దంలో జోగిపేటకు చెందిన ఇద్దరు యువకులు, గురువారం జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
నాలుగు లేన్ల రోడ్డుగా..
జోగిపేట- సంగారెడ్డి రోడ్డును నాలుగులైన్లుగా మారుస్తున్నారు. రోడ్డు పెద్దదైతే ప్రమాదాలు తగ్గుతాయని భావించినా ప్రమాదాల సంఖ్య మాత్రం పెరుగుతున్న ది. అన్నాసాగర్, అల్మాయిపేట్, చౌటకూర్ క్రాసింగ్, ఎంపీ డిస్టీలరి (బీరు ఫ్యాక్టరీ) సుల్తాన్పూర్ క్రాసింగ్, శివంపేట్ క్రాంసిగ్, శివ్వంపేట్ బ్రిడ్జి వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. సంగుపేట-నుంచి శివ్వంపేట వరకు నాలుగులేన్ల రోడ్డు పనులు చేస్తున్నారు. పనులు జరిగే చోట సూచికలు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కాంట్రాక్ట ర్లు పనులు త్వరగా పూర్తిచేసి, రోడ్డుపై సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గించవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మంచుకురిసే వేళలో తస్మాత్ జాగ్రత్త
చలికాలం కావడంతో ఉదయం పూట విపరీతంగా మంచు కురుస్తున్నది. ఇలాంటి సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమమని పోలీసులు సూచిస్తున్నారు. బుధ, గురువారాల్లో జరిగిన రెండు ప్రమాదాలు కూడా మంచు కారణంగా జరిగినవే.
ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
జోగిపేట-సంగారెడ్డి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డుపై మొబైల్ టీం, అవుట్ పోస్టు ఏర్పాటు చేయనున్నాం. చౌటకూర్‌లో పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేస్తున్నాం. పోలీస్‌స్టేషన్, అవుట్ పోస్టు ఏర్పడితే జోగిపేట- సంగారెడ్డి వరకు రోడ్డుపై వెళ్లే వాహనాల కదలికలపై దృష్టి పెట్టొచ్చు. రోజు వాహనాల తనిఖీ చేపట్టి ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పిస్తున్నాం. ద్విచక్ర వాహనాలను నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్‌బెల్టు పెట్టుకోవాలి. వారంలో జరిగిన ప్రమాదాలు మంచు కారణంగా జరిగినవే.. ముందు వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాలు జరుగుతున్నాయి.
– రవీందర్‌రెడ్డి. డీఎస్పీ, సంగారెడ్డి