హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 7: నిలువ నీడలేక రోడ్డున పడ్డామని… ఆదుకోండి… అంటూ సోమవారం హుస్నాబాద్ అగ్నిమాపక సిబ్బంది వేడుకున్నారు. అగ్నిమాపక శాఖకు సరైన భవనం లేకపోవడంతో వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుమిత్ర సంఘాల పరస్సర సమాఖ్య భవనంలో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సిబ్బందికి సరిపడా గదులు లేకపోవడం, ప్రమాదాల నివారణకు సంబంధించిన పరికరాలు పెట్టేందుకు గది లేకపోవడంతో కొంతకాలంగా యార్డులోని ఒక వ్యాపారి అద్దెకు తీసుకున్న షెటర్లో నిల్వ ఉంచారు. సదరు వ్యాపారికి పండ్ల సీజన్ రావడంతో ఖాళీ చేయమన్నాడు. అగ్నిమాపక నివారణ పరికరాలను కార్యాలయం ఎదుటే పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 2010లో తాత్కాలికంగా ఫైర్‌స్టేషన్ కాంట్రాక్ట్‌తో ప్రారంభం కాగా.. 2022లో అగ్నిమాపక శాఖ స్వాధీనం చేసుకొని నిర్వహిస్తున్నది. దీనికి సొంత భవనం లేకపోవడంతో మార్కెట్ యార్డులోనే ఫైర్ అధికారి, వాహనం, సిబ్బంది ఉంటున్నారు. నీటి సౌకర్యం, సాన్నాలు, మరుగుదొడ్లు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.. మార్కెట్ యార్డు కావడంతో ఎప్పుడూ ధాన్యంతో నిండి ఉండడంతో ప్రమాదాలు జరిగినప్పుడు వాహనం బయటకు తీసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైగా దుమ్ముధూళి ఎక్కువగా వస్తుండటంతో సిబ్బందికి అనారోగ్యంతోపాటు వాహనం సైతం మొరాయిస్తుండడంతో సిబ్బంది అవస్థలు పడుతున్నారు.
యార్డులో దుమ్మూధూళి భరించలేకపోతున్నామని, అగ్నిమాపక పరికరాలు, సిబ్బంది ఉం డేందుకు ఇబ్బందులు అవుతున్నాయని ఫైర్‌స్టేషన్ సిబ్బంది ఇటీవల బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌తో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులను వేడుకున్నా.. ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫైర్‌స్టేషన్‌కు స్థలం కేటాయించినప్పటికీ భవన నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పట్టణంలో నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు ఉన్నప్పటికీ ఫైర్‌స్టేషన్‌కు ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడంతో వారు రోడ్డున పడాల్సి వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఫైర్ సిబ్బంది ఉండేందుకు, పరికరాలు పెట్టేందుకు ఇబ్బందిగా ఉంది. ఒక వ్యాపారి గదిలో ఇన్నాళ్లు
పరికరాలు పెట్టుకున్నాం. ఖాళీ చేయమనడంతో ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి. తాత్కాలికంగా
వేరే ప్రాంతంలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సహకరించాలి.
– రాజయ్య, ఫైర్ ఆఫీసర్, హుస్నాబాద్ టౌన్