పటాన్చెరు, ఏప్రిల్ 18: ప్రజలకు అవసరమైన కూరగాయలు, మటన్, చికెన్, చేపలు, ఇతరత్రా వంట సామగ్రి ఒకేచోట లభించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీకి సమీకృత మార్కెట్ మంజూరు చేసింది. రూ.4.50 కోట్ల నిధులు సైతం కేటాయించింది. కాగా, తెల్లాపూర్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. పిల్లర్ల పనులు చేసి నిధులు లేవని కాంట్రాక్టర్ మధ్యలో ఆపేశారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తెల్లాపూర్ మున్సిపాలిటీ హైదరాబాద్‌కు సమీపంలో ఉంటుంది. ఇక్కడ అధికంగా ఐటీ ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. మున్సిపల్ పరిధిలోని కాలనీలు, గ్రామాలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయి. కొత్త కాలనీలు శరవేగంగా వెలుస్తున్నాయి. జనాభా విపరీతంగా పెరిగింది. గ్రామాలు సైతం శరవేగంగా అభివృద్ధి వైపు పరుగులు తీయడంతో మున్సిపల్ పరిధిని పెంచారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో నివాసముండే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బీఆర్ఎస్ హయాంలో నాటి మంత్రి హరీశ్‌రావు కృషిచేశారు. ఇక్కడ సమీకృత కూరగాయల మార్కెట్ మంజూరు చేయించి రూ.4.50 కోట్లు కేటాయించారు.
టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించగా, కాంట్రాక్టర్ బిల్లులు రావడం లేదని పనులు మధ్యలో ఆపేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెల్లాపూర్ సమీకృత మార్కెట్ నిర్మాణానికి గ్రహణం పట్టింది. తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం పక్కన జీప్లస్-2 విధానంలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. కూరగాయలతో పాటు మటన్, చికెన్, చేపలు అమ్మకాలు చేసేందుకు షాపుల నిర్మాణం ప్రారంభించారు.
పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవడంతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్‌రెడ్డి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ తెల్లాపూర్ సమీకృత మార్కెట్ పనులు మాత్రం పూర్తి కావడం లేదు. ఎమ్మెల్యే సైతం సరిగ్గా దృష్టిపెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి.
తెల్లాపూర్ మున్సిపాలిటీలో అసంపూర్తిగా ఆగిన సమీకృత మార్కెట్ పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించాం. భవన నిర్మాణానికి రూ.4.50 కోట్లు గత ప్రభుత్వం మంజూరు చేసింది. కాంట్రాక్టర్‌కు పనులు అప్పంచాం. నిధులు కొరతతో కాంట్రాక్టర్ పనులు మధ్యలో ఆపేశారు. జనరల్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తాం.
– సంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ తెల్లాపూర్