హుస్నాబాద్, ఆగస్టు 13: దివ్యాంగులు, చేయూత పెన్షన్ దారుల పింఛన్ సెప్టెంబర్ లోపు పెంచుతూ ప్రకటన చేయకుంటే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని రాజరాజేశ్వర్ ఫంక్షన్ హాల్లో దివ్యాంగులు, చేయూత పెన్షన్ దారుల మహాగర్జన సభ నియోజకవర్గ స్థాయి సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని 50లక్షల మంది పెన్షన్ దారుల ఆశలను వమ్ము చేసి వీరు ఏమీ చేయలేరనే ధైర్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నదని, గతంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ప్రశ్నించేవారు లేకనే 20నెలలుగా పించన్లు పెంచకుండా, కొత్తవి ఇవ్వకుండా దివ్యాంగులు, వృద్ధులను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. గతంలో ఉద్యమాల ద్వారా ఆరోగ్యశ్రీ, రేషన్, పింఛన్ల పెంపును సాధించుకున్నామని గుర్తు చేశారు.
ఎమ్మార్పీఎస్ అంటే కేవలం కులాల కోసమే కాదని, కులమతాలకు అతీతంగా మానవత్వ విలువల కోసం పోరాటాలు చేస్తుందన్నారు. సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లో జరుగబోయే మహాగర్జన సభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వీహెచ్పీఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ దండు శంకర్, జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య, జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ చిట్టెల సంపత్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కాయిత నవీన్‌రెడ్డి, రాజేశ్వరి, సరిత, ఎమ్మార్పీఎస్ నాయకులు, దివ్యాంగులు, చేయూత పెన్షన్‌దారులు పాల్గొన్నారు.