కొండపాక(కుకునూరుపల్లి), జూన్ 12: మానవసేవే మాధవసేవ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని సత్యసాయి సంజీవని దవాఖానకు గురువారం లయన్స్ క్లబ్ హైదరాబాద్ ఆదర్శ ప్రతినిధులు అంబులెన్స్‌ను రమణాచారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ.. మానవసేవే మాధవసేవ అనే గొప్ప సంకల్పంతో సత్యసాయి సేవా ట్రస్ట్ సేవలు అందిస్తున్నదన్నారు.
వారి సేవలు వెలకట్టలేనివన్నారు. ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా సేవలు అందిస్తూ ప్రాణదానం చేసిన ఘనత సంజీవని దవాఖానకు దక్కుతుందన్నారు. ఇలాంటి సేవలకు తమ వంతు తోడ్పాటుగా అంబులెన్స్‌ను అందజేసిన హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆదర్శ ప్రతినిధులను రమణాచారి అభినందించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆదర్శ ప్రతినిధులు నయనదేవి, సుబ్బలక్ష్మి, కృష్ణకుమారి, సుజాత, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ, ఆపూర్వ, సంజీవని దవాఖాన నిర్వాహకులు జగన్నాథశర్మ తదితరులు పాల్గొన్నారు.