హత్నూర, జనవరి 30: భూతగాదాలో వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హత్నూర పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన దుర్గమొల్ల బలరాం, పోచయ్య, కృష్ణ అన్నదమ్ములు. కొన్నేండ్లక్రితం పోచయ్యకు చెందిన ఇంటి స్థలాన్ని అదే గ్రామానికి చెందిన మీసాల స్వామికి విక్రయించాడు. తనకు వాటా ఇవ్వడం లేదని నిర్మాణ పనులు అడ్డుకున్నాడు. దీంతో మీసాలస్వామి హత్నూర పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు.
ఎస్సై లక్ష్మారెడ్డి అన్నదమ్ములతో పాటు మీసాలస్వామిని పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించాడు. అన్నలు మోసం చేస్తున్నారని మనోవేదనకు గురై, ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు గమనించి 108కు సమాచారం ఇచ్చి సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.