మెదక్ రూరల్, నవంబర్ 15: కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట గ్రామానికి చెందిన మామిడి సుధాకర్‌రెడ్డి బుధవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో మాచవరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన వెంట మండలానికి చెందిన ఆయన మద్దతుదారులు భారీగా సుమా రు 1000 మంది కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మామిడి సుధాకర్‌రెడ్డికి, ప్రజాప్రతినిధులు, నాయకులకు మంత్రి హరీశ్‌రావు, అందోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్‌తో కలిసి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గొప్ప మ్యానిఫెస్టోను రూపొందించారన్నారు. వృద్ధులు, వితంతులకు ఆసరా పింఛన్ రూ. 5016కు పెంచుతారని అన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతులకు రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ తదితర కార్యక్రమాలు, దళితుల కోసం దళిత బంధు లాంటి వినూత్న పథకాలు చేపట్టి దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిపారన్నారు. అనంతరం ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ఎల్లుపేట గ్రామ పరిధిలోని తండాలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన పేరును మరువలేనివిగా చేశాయన్నారు. సుధాకర్‌రెడ్డి చేరికతో పార్టీ బలోపేతమయ్యిందన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు మరింత అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్మెంట్ భూముల నిబంధనలను సులభతరం చేస్తామన్నారు. తండాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న లక్ష్యంతో తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు.
అందోల్ నియోజకవర్గంలో ప్రతి తండాకు రూ.40 లక్షలు నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసి తండాల అభివృద్ధికి కృషి చేశామన్నారు. 30 ఏండ్లుగా ఏ ప్రభుత్వం తండాలకు ఇన్ని నిధులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. అనంతరం మామిడి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను ఎంతోగానో ఆకర్షించాయన్నారు. అందరం కష్టపడి అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఐదేండ్లు మనకు సంక్షేమ పథకాలు అందుతాయని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. కార్యక్రమంలో స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి, ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బాలయ్య, పార్టీ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాశ్, బీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు భాస్కర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.