సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 2: పది వేల ఎకరాల్లో పంటలు ఎండుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని, కూడవెల్లి వాగులోకి తక్షణమే నీటిని విడుదల చేయాలని, లేకపోతే రైతులతో కలిసి మల్లన్నసాగర్‌ను ముట్టడిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా రైతులను ఆదుకోవాలని, ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని, రూ.2 లక్షల పంట రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్ మను చౌదరికి మంగళవారం ఆయన వినతిపత్రం అందజేశారు. హరీశ్‌రావు వెంట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభు త్వం నీటి నిర్వహణలో వైఫల్యం, విద్యుత్ నిర్వహణలో లోపాల కారణంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఆవేదన చెందుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరువు నివారించే ప్రయత్నాలు చేయకుండా, కరువును పెంచి రైతులను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపాలని, రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసినట్లు హరీశ్‌రావు తెలిపారు.
రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పలు డిమాండ్లను పెడుతున్నదని హరీశ్‌రావు అన్నారు. వడగండ్ల వాన, నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పిన హామీలను కాంగ్రెస్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంట రుణమాఫీ చేయమంటే మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎన్నికల కోడ్ అని అబద్ధ్దాలు చెబుతున్నాడని, 100 రోజులు నిండిన తరువాతనే ఎన్నికల కోడ్ వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. అప్పులు తీర్చాలని బ్యాంక్ అధికారులు రైతులను వేధిస్తున్నారన్నారు. యాసంగిలో వచ్చే వడ్లకు, మక్కలకు వెంటనే బోనస్ ఇచ్చి కొనాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ.15 వేలు రైతుబంధు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు ఎకరానికి రూ.12 వేలు వెంటనే ఇవ్వాలన్నారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా కాంగ్రెస్ నిలుపుకోలేదని.. అడుగడునా కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యా యం చేస్తున్నదన్నారు. ఇవన్నీ గొంతెమ్మ కోరికలు కాదని.. ఎన్నికల సమయంలో మీరు ఊరూరా తిరిగి చెప్పడమే కాకుండా 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చిన వాగ్ధానాలే అని హరీశ్‌రావు అన్నా రు. కొత్త పథకాలు ఏమో కానీ.. ఉన్న పథకాలను కూడా తీసేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో నాణ్యమైన 24 గంటలు వచ్చేదని.. నేడు 14,15 గంటలు కూడా సరిగా రావడం లేదన్నారు. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో రైతులపై ఆర్థిక భారం పడుతున్నదని హరీశ్‌రావు అన్నారు.
సిద్దిపేట జిల్లాలోని కూడవెల్లి వాగులోకి వెంటనే మల్లన్నసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కూడవెల్లి వాగుకు రెండు వైపులా ఉన్న పం టలు ఎండిపోతున్నాయని, తక్షణమే నీటిని విడుదల చేయాలన్నారు. గజ్వేల్, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ఐదారేండ్లుగా ఒక్క ఎకరా ఎండిపోకుండా నీళ్లు అందించామన్నారు. మల్లన్నసాగర్లో నీళ్లు ఉండి కూడా నీటిని విడుదల చేయడం లేదని ప్రభుత్వంపై హరీశ్‌రావు మండిపడ్డారు. పది వేల ఎకరాల్లో పంటలు ఎండుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుదన్నదని ధ్వజమెత్తారు. దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయినా.. ప్రభుత్వంలో చలనం లేదన్నారు. 24 గంటల్లో కూడవెల్లి వాగుకు నీళ్లు విడుదల చేయకపోతే పెద్దఎత్తున రైతులను తీసుకెళ్లి మల్లన్నసాగర్‌ను ముట్ట్టడిస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. అవసరమైతే తామే గేట్లు ఎత్తి కూడవెల్లి వాగుకు నీళ్లు వదులుతామన్నారు. ఆ పరిస్థితి రాకముందే ప్రభు త్వం మొద్దునిద్ర వదిలి తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడా బోరు బండ్లు కనబడలేదని..క్రేన్లు కనబడలేదని.. కాంగ్రెస్ ప్రభు త్వం రాగానే రైతుల కష్టమంతా బోర్లలో పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు మాని.. రైతులను కాపాడాలని హరీశ్‌రావు హితవు పలికారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ కన్వీనర్ వంగ నాగిరెడ్డి, సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రాజనర్సు, పీఏసీఎస్ చైర్మన్ రమేశ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి, శ్రీహరియాదవ్, పురేందర్, కిష్టారెడ్డి, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.