మెదక్, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పేరును వెంటనే ఎమ్మెల్సీ లిస్టులో చేర్చి దళిత జాతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణ మాల మహానాడు అధ్యక్షుడు బత్తుల ప్రసాద్, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి వెంకటేశ్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ఉన్న సెల్ టవర్ ఎకి రెండు గంటల పాటు హల్చల్ చేశారు. రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అద్దంకి దయాకర్‌రావుతో ఫోన్లో మాట్లాడితే తప్ప కిందికి దిగమని పట్టుబట్టారు. అయితే, పిల్లి సుధాకర్ సెల్‌టవర్ ఎక్కిన ఇద్దరికి ఫోన్‌చేసి మాట్లాడి నచ్చజెప్పడంతో ఎట్టకేలకు సెల్ టవర్ నుంచి కిందికి దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమన్నారు.
దళిత బహుజనులను నిరాశకు గురిచేసిందన్నారు. గతంలో అద్దంకి దయాకర్‌కు తుంగతుర్తి టికెట్ ఇస్తామని చెప్పి చివరి క్షణంలో వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్యేగా అవకాశమిచ్చారని, అదే తరహాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించి చివరి క్షణంలో వేరే వ్యక్తి పేరు ఖరారు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసి చట్టసభల్లోకి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగంగా మాట ఇచ్చి ఈరోజు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే అద్దంకి దయాకర్ రావు పేరును ఎమ్మెల్సీ లిస్టులో చేర్చే విధంగా కాంగ్రెస్ హై కమాండ్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు.