గజ్వేల్, అక్టోబర్ 13: సాగుచేసి పండించిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండించిన పంటను కొనుగోలు చేయడానికి అధికారులు ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు. దీంతో చేసేదేమి లేక తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించడంతో క్వింటాల్ మక్కలపై రూ.400 నుంచి రూ.500వరకు నష్టపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్‌కు పంట దిగుబడి వస్తుంది. పంటను అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నా అధికారుల నుంచి కొనుగోలు కేంద్రాలపై ఎలాంటి స్పష్టత రావడం లేదు.
సిద్దిపేట జిల్లాలో వానకాలంలో రైతులు 5లక్షల పైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. అందులో ప్రధానంగా 3.63లక్షల ఎకరాల్లో వరి, 1.07లక్షల ఎకరాల్లో పత్తి, 28,643 ఎకరాల్లో మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేశారు. ఈ సారి జిల్లాలో సుమారు 7లక్షల క్వింటాళ్ల మక్కల దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు. గతేడాదితో పోల్చితే ఈ సారి రైతులు మొక్కజొన్న సాగుపై ఎక్కువగా ఆసక్తి చూపించారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి అధిక వర్షాలు పడటంతో మొక్కజొన్నకు తీరని నష్టం జరిగింది.
ప్రభుత్వం సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడంతో సాగుచేసిన మొక్కజొన్నకు యూరియా సకాలంలో వేయక దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. చేతికొచ్చిన పంట అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడంతో రైతులు పండించిన పంటను ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తూ తీరని నష్టాన్ని చవిచూస్తున్నారు. మొక్కజొన్నకు గతేడాది రూ.2,225 మద్దతు ధర ఉండగా ఈ సారి ప్రభుత్వం రూ.175 పెంచగా ప్రస్తుతం రూ.2400కు చేరింది. కానీ జిల్లాలో ఎక్కడ కూడా రైతులకు మద్దతు ధర దక్కకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
మార్క్‌ఫెడ్ అధికారులు రెండేండ్లుగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేసేదేమి లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి పండించిన మక్కలను క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు నష్టానికే అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ ధర క్వింటాల్‌కు రూ.2 400 ఉండగా ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.1900 నుంచి రూ.2000కే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం.. మార్క్‌ఫెడ్ అధికారుల ఉదాసీనత వల్ల మక్క రైతుకు సాగు ఖర్చులేమో కాని నష్టం రాక తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతంలో మార్క్‌ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఈసారి మొక్కజొన్న పంటలో ఆశించిన విధంగా దిగుబడి రాదని రైతులు చెప్పుతున్నారు. పంట సాగు సమయంలో కొద్దిపాటిగా కురిసిన వర్షాలు ఆగస్టు, సెప్టెంబర్‌లో అధికంగా పడటంతో మొక్కజొన్నపై తీవ్ర ప్రభావం పడింది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 28,643 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా ఎకరాకు దిగుబడి 24 క్వింటాళ్లలోపే వచ్చే అవకావం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు అధికంగా కురవడం ఒకెత్తయితే ప్రభుత్వం సకాలంలో యూరి యా అందుబాటులో ఉంచకమరో సమస్యగా మారింది.
మొక్కజొన్న పండించేందుకు పెట్టిన ఖర్చులైనా రావడం లేదు. పండించిన మక్కలను ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నాం. వ్యాపారులు చెప్పిన ధరకే గ్రామంలోని రైతులు విక్రయి స్తున్నారు. సర్కార్ కొనకపోవడంతో ప్రైవేట్‌లోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాలు ఎక్కువ పడడంతో పంట దెబ్బతింది. పండించిన పంటైనా ప్రభుత్వం కొంటే మాకు న్యాయం జరిగేది.
– వకులోత్ గోపాల్, రైతు, ఏటిగడ్డకిష్టాపూర్,ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ, సిద్దిపేట జిల్లా
మక్కలను ప్రభుత్వం కొనకపోవడంతో క్వింటాల్‌కు రూ.500 నష్టానికైనా అమ్ముకుంటున్నాం. మార్కెట్లో మద్దతు ధర రావడం లేదు. ఎకరం మక్క సాగుచేస్తే 30 క్వింటాళ్ల దిగుబడైనా వస్త్తదో రాదో చూడాలే. ఎండకు ఎండబెడుతున్నా. ఆరిన తర్వాత పట్టించి అమ్మాలే. రైతులకు ప్రభుత్వం మేలు చేసేలా పంట కొంటే మాకు లాభం జరుగుతది.
-అజ్మిరా శ్రీనివాస్, రైతు, ఏటిగడ్డకిష్టాపూర్, ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ, సిద్దిపేట జిల్లా