నర్సాపూర్, ఏప్రిల్ 26: కేసీఆర్ ఆనవాళ్లను చెరపడం ఎవరి తరం కాదని, తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉండిపోతారని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు. శనివారం నర్సాపూర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ 25 సంవత్సరాల పండుగ సందర్భంగా రజతోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణు లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్నదని శుభాకాంక్షలు తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి భారీగా తరలివస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచే కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ సభకు తరలివస్తున్నారని తెలిపారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ జరుగని విధంగా, కనీవినీ ఎరుగని రీతిలో ఈ సభ జరగబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించే చర్చ జరుగుతున్నదని వెల్లడించారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణను సాధించిన అధినాయకుడు, అపర భగీరథుడు కేసీఆర్ నాయకత్వం మళ్లీ రావాలని ప్రజలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారన్నారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి తెలంగాణను అగ్రస్థానంలో కేసీఆర్ నిలిపారన్నారు. సాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై ఎన్నో నిందలు వేస్తున్నదని, మల్లన్నసాగర్, కొండపోచమ్మ నుంచి హల్దీ వాగులోకి నీటిని వదిలి, వేల ఎకరాలను సస్యశ్యామలం చేసిన ఘనతే బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ పథకాలను మార్చవచ్చు కాని ప్రజల మదిలో కేసీఆర్‌ను తుడపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు కరెంట్ పోతే విశేషమని నేడు కరెంట్ ఉంటే విశేషమనే విధంగా పరిస్థితి మారిందన్నారు. మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమని, ప్రజలు కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారన్నారు.
నేడు గ్రామగ్రామన జెండాను ఎగరవేసి రజతోత్సవ సభకు భయలుదేరుతామని, వేసవి దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, నాయకులు నర్సింహులు, సుధాకర్‌రెడ్డి, రాకేశ్‌గౌడ్ పాల్గొన్నారు.