దుబ్బాక, నవంబర్ 15: భూమిపై కన్నేసిన అక్రమార్కులు తప్పుడు భూరికార్డులు సృష్టించడంతోపాటు అందులో కొంత భూమిని ఇతరులకు విక్రయించారంటూ బాధితుడు బత్తిని మహేందర్ గౌడ్ శుక్రవారం విలేకరుల ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో సర్వే నెంబరు 25, 26, 28లో 11 ఎకరాల 23 గుంటల భూమి వారసత్వంగా మా తాత బత్తిని సీతయ్య గౌడ్ నుంచి వచ్చిందని మహేందర్ గౌడ్ తెలిపాడు. 1953 వరకు బత్తిని సీతయ్య పేరిట రికార్డులో ఉందన్నారు.
ఉపాధి నిమిత్తం తన తండ్రి, బాబాయ్‌లు హైదరాబాద్‌కు వెళ్లడంతో తన భూమిపై కన్నేసిన అక్రమార్కులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు. ఈ విషయంపై 1995లో తన తండ్రి బత్తిని కిష్టయ్య కోర్టులో కేసు వేయగా అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందన్నారు. ఇదిలాఉండగానే కొంత భూమిని అక్రమార్కులు ఇతరులకు విక్రయించినట్లు తెలిపారు. కోర్టులో కేసు ఉండగా భూమిని విక్రయించడం చట్టవిరుద్ధమన్నారు. అక్రమార్కులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడం వల్ల అధికారులు సైతం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
త్వరలోనే కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉందన్నారు. అక్రమార్కుల వల్ల భూమి కొనుగోలు చేసినవారు సైతం కోర్టు చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సిరిసిల్లకు చెందిన ఎర్రగుంట భరత్‌కుమార్‌తో పాటు బత్తిని సతీశ్‌కుమార్ తదితరులు తప్పుడు రికార్డులు సృష్టించారని ఆరోపించాడు. వారిపై కోర్టులో విచారణ జరుగుతుందన్నారు. ఈ విషయంపై దుబ్బాక ఆర్ఐ నర్సింహారెడ్డిని వివరణ కోరగా.. ఆ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో కొనసాగుతుంది. ఆ భూమిలో ఎర్రగుంట భరత్‌కుమార్ అనే వ్యక్తి నాలా కన్వర్షన్ లేకుండా 1800 గజాల స్థలాన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. అతడిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పట్టా భూమి కావడంతో కోర్టు ఆదేశాల మేరకు అర్హులైన వారికి రికార్డులో వస్తుందన్నారు.