నారాయణఖేడ్, మార్చి 7: దళితబంధు నిధులు విడుదల చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదలమని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో దళితబంధు పథకం మంజూరైన లబ్ధిదారులకు నిధులు విడుదల చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఇవ్వాలనే డిమాండ్‌తో శుక్రవారం నారాయణఖేడ్‌లోని రాజీవ్‌చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. దళితులు పూర్తిస్థాయిలో అభ్యున్నతి సాధించాలనే ఉద్దేశంతో కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేసి తొలి విడుతగా లబ్ధ్దిదారుల ఖాతాల్లో రూ.3 లక్షలు జమ చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బులు విడుదల చేయకుండా అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దళిత డిక్లరేషన్ పేరిట ఎస్సీలకు 18శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి రూ.12 లక్షలు అందజేస్తామని, మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏటా రూ.750 కోట్ల నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం దళితుల విదేశీ విద్య కోసం రూ.20 లక్షలు ఇవ్వగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు.
దళిత విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం 300 సాంఘిక సంక్షేమ గురుకులాలు ఏర్పాటు చేయగా, 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో దళితుల కోసం ఒక్క విద్యాలయం నెలకొల్పలేదని మండిపడ్డారు. అబద్ధపు హామీలతో దళితుల ఓట్లను దండుకున్న కాంగ్రెస్ పార్టీ , అధికారం చేపట్టిన తర్వాత వంచనకు గురిచేస్తున్నదని విమర్శించారు. ‘ఖేడ్’ నియోజకవర్గంలో దళితబంధు మంజూరైన 1100 దళిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉండి పోరాటం చేస్తుందని, దళితబంధు నిధులు విడుదలయ్యే వరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో దశల వారీగా పోరాటం చేస్తామని మహారెడ్డి భూపాల్‌రెడ్డి భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు భూపాల్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. దళిత డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి దళితులకిచ్చిన హామీలను ఫోన్లో వినిపించారు. ధర్నాలో ‘ఖేడ్’ బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పరమేశ్, నగేశ్, నాయకులు రవీందర్‌నాయక్, ఎంఏ నజీబ్, ఆహీర్ పరశురామ్, అభిషేక్ శెట్కార్, విఠల్, చన్బసప్ప, సంగప్ప, విశ్వనాథ్, సాల్మన్, ప్రసాద్, విజయ్, రాజునాయక్ పాల్గొన్నారు.