నారాయణఖేడ్, ఏప్రిల్ 4: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం దుర్మార్గమని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఖండించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత కార్యాలయంపై దాడి చేయడం అత్యంత ఆందోళన చెందాల్సిన విషయమన్నారు.
రోజురోజుకూ బీఆర్ఎస్, కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు పెరుగుతున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేక సీఎం రేవంత్‌రెడ్డి దాడులకు పురికొల్పుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగడం సరికాదన్నారు. హామీలు అమలు చేసేవరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలిచి పోరాడుతుందని, ఇటువంటి దాడులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరని స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు నగేశ్, ఎం.ఏ.నజీబ్, లయక్, నాగరాజు, మల్గొండ పాల్గొన్నారు.