సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 10 : నాడు తెలంగాణ ఉద్యమంలో.. నేడు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉం టుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలో మంత్రి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్, విరాహత్, జిల్లా అధ్యక్షుడు రంగాచారితో ఎంతో అనుబం ధం ఉన్నదని గుర్తుచేశారు.
దేశంలోనే ఎకడా లేని విధంగా 1996 దశకంలో రవాణా శాఖ మం త్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ గ్రామీణ ప్రాంత విలేకరులకు బస్‌పాస్‌లు అందించారని గుర్తుచేశారు. అక్రిడిటేషన్ల కోసం జర్నలిస్టు సంఘ అధ్యక్షుడు రంగాచారి తన వెంట పడేవారని, ఆయన మాటను తానెప్పుడూ కాదనలేదని, ఇవాళ జిల్లాలోనే 649 మందికి అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చామన్నారు. రూ.70లక్షలతో సిద్దిపేట ప్రెస్‌క్లబ్, దుబ్బాక, హుస్నాబాద్‌లో తలా రూ.20 లక్షలతో ప్రెస్‌క్లబ్‌లకు మంజూరు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆయన గుర్తుచేశారు.ఉమ్మడి మెదక్ జిల్లా లో రెండు మూడు మండలాలు మినహాయిస్తే పట్టణాలు, మండలాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చామన్నారు. ఆపరేటర్లు, కెమెరామెన్లకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు కేటాయించామన్నారు. తెలంగాణలో 22 వేల మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. జర్నలిస్టుల ఫెడరేషన్ ఫండ్ ఏర్పాటు చేసి ఆదుకుంటున్నట్లు తెలిపారు. సీఎం సహాయ నిధి ద్వారా తానే స్వయంగా 220 మంది జర్నలిస్టులకు ఎల్వోసీ ద్వారా సాయం అందించామన్నారు.
ఇటీవల గజ్వేల్‌లో ఆత్మహత్య చేసుకున్న వేణుమాధవ్ కుటుంబానికి రూ.2లక్షలు అందించినట్లు తెలిపారు. ఉల్టాగా పత్రికలకు ఖర్చు పెడు తూ జర్నలిస్టులు కష్టపడుతున్నారని, జర్నలిస్టుల పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎలా ఉందో సవివరంగా వివరించారు. ఇటీవల దుద్దెడలో ఒక అమ్మాయి క్యాన్సర్‌తో బాధపడుతుంటే.. ఓ పత్రిక ద్వారా తన దృష్టికి రావడంతో మెరుగైన వైద్యం అందించినట్లు తెలిపారు. టీయూడబ్ల్యూజే వారు కూడా వృత్తి నైపుణ్యం కోసం కృషి చేస్తే తనవంతుగా సహకారాన్ని అందిస్తామని ధీమానిచ్చారు.
జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
ఆరోగ్యంపై జర్నలిస్టులు శ్రద్ధ పెట్టాలని మంత్రి అన్నారు. సమయానికి నిద్ర, తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని, సమాజ శ్రేయస్సు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వృత్తి అలాంటిందన్నారు. ఎంతో ఒత్తిడితో ఉండే జర్నలిస్టులు నిత్యం గంట యోగా, నడక, ప్రాణాయామం చేయాలని కోరారు. జిల్లాలోని జర్నలిస్టులకు 134 రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయిస్తామని చెప్పారు. వెల్నెస్ కేంద్రాల్లో కూడా మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రిని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం
-మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, వారికి అండగా ఉంటామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఎంపీగా రెండుసార్లు పనిచేస్తున్న సందర్భంలో ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జర్నలిస్టులతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో జర్నలిస్టులకు మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాలు ఇచ్చామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. మంత్రి ఆధ్వర్యంలో వారికి త్వరలో పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.