అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న ఆదాయం ( Revenue ) తో పురోగతి సాధించాల్సి ఉండగా తిరుగమనంలో ఉంటుందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) ఆరోపించారు. రావాల్సిన ఆదాయం చంద్రబాబు( Chandra Babu ) , సహచర మంత్రుల జేబుల్లోకి వెళుతుండడం వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని విమర్శించారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు పాలన తీరును తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. చంద్రబాబు చెప్నేవన్నీ గారడీ లెక్కలేనని, పబ్లిసిటీ పీక్.. పర్ఫామెన్స్ వీక్ అంటూ ఎద్దేవా చేశారు. తప్పుడు లెక్కలతో తన డప్పు తానే కొట్టుకుంటున్నాడని ఆరోపించారు. కంప్ట్రొరల్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన నివేదికలో ఆదాయం రాబడిలో ఏపీ 22 వ స్థానంలో ఉందని, చివరి నుంచి రెండోస్థానంలో ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు అసమర్దతే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
కేవలం రెండేళ్ల కాలానికి 1.97శాతం పెరుగుదల ఉందని ఆరోపించారు. చంద్రబాబు మాత్రం 2024-25లో 11.75 శాతంతో, 2025-26 10.75 శాతం అభివృద్ధితో దూసుకుపోతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్రానికి ఆదాయం రావడం లేదని, తగ్గుదల మాత్రమే ఉందని వెల్లడించారు.
మద్యం, ఇసుక, సిలికాన్ , ప్రభుత్వ భూములు ఎడాపెడా నచ్చిన వ్యక్తులకు దోచుకుపెడుతూ జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పర్యటనలకు ప్రత్యేక హెలికాప్టర్, విమానాలున్నాయని, వాటిలో చక్కర్లు కొడుతూ జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. నారా లోకేష్ ఇటీవల ప్రత్యేక విమానంలో కొలంబోకు వెళ్లి క్రికెట్ చూశారని, ఇంట్లో ఉండి టీవీ చూస్తే సరిపోదా అంటూ ప్రశ్నించారు.