హరివరాసనం స్వామి విశ్వమోహనం.. శరణకీర్తనం.. స్వామి శక్తమానసం.. అంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం భక్తి పారవశ్యంలో మునిగితేలింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మైత్రి మైదానంలో అయ్యప్ప మహాపడిపూజ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చింది. అయ్యప్ప శరణు మార్మోగింది.
పూజలు చేస్తున్న శబరిమల పూజారులు
పటాన్చెరు, డిసెంబర్ 5 : పటాన్చెరు పట్టణం భక్తి పారవశ్యంలో మునిగితేలింది. అయ్యప్పస్వామి శరణుఘోషతో పట్టణం అంతా మార్మోగింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్పస్వామి మహాపడిపూజకు భక్తులు భారీగా హాజరయ్యారు. మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అయ్యప్పస్వామి మహా పడిపూజ వైభవంగా జరిగింది. శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం నుంచి వచ్చిన పూజారులు మహాపడిపూజను నిర్వహించారు. ప్రముఖ సినీ గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆధ్వర్యంలో ఆలపించిన భక్తిపాటలు, అయ్యప్పస్వామి భజనలు భక్తులను అలరించాయి. తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన పూజలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు. అయ్యప్పస్వామి శరణు.. శరణు అంటూ భక్తులు చేసిన నినాదాలతో పటాన్చెరు దద్దరిల్లింది.
మహాపడిపూజకు పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం సమీపం నుంచి మైత్రి మైదానం వరకు ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేశారు. అడుగుకొక దేవతా విగ్రహం ఏర్పాటు చేశారు. పూజారులు అచ్చం శబరిమలలో నిర్వహించిన విధానంలోనే పూజలు చేయడంతో నిజంగా శబరిమలలో ఉన్నామనే భావన భక్తుల్లో కలిగింది. భారీ సెట్టింగులు వేయడంతో కొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతిని పొందారు. అయ్యప్పస్వామి దివ్యరూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయం చెందారు. స్వామి వారి నగలను ప్రత్యేకంగా తీసుకునివచ్చారు. మాలధారణ చేసిన భక్తులు భజనలు, నృత్యాలు చేస్తూ వస్తుంటే భక్తులు వారి పాదాలను మొక్కి భక్తిని చాటుకున్నారు.
ప్రముఖ గాయకుడు విజయ్ ఏసుదాస్‌ను సత్కరిస్తున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
అయ్యప్పస్వామి పాటలు పాడటంలో సిని నేపథ్య గాయకుడు జే.ఏసుదాస్ ప్రత్యేకత అందరికి తెలిసిందే. ఆయన కుమారుడు విజయ్ ఏసుదాస్ కూడా యువగాయకుడిగా రాణిస్తున్నాడు. విజయ్ ఏసుదాస్‌తో ఏర్పాటు చేసిన భక్తి పాటల కచేరీ భక్తులను అలరించింది. తన తండ్రి ఆలపించిన అయ్యప్పస్వామి భక్తిపాటలతో పాటు కొత్తగా వచ్చిన భజనలను కూడా ఆలపించి విజయ్ అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా విజయ్ ఏసుదాస్‌ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రత్యేకంగా సత్కరించి మెమొంటో అందజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జైపాల్, ఎంపీపీలు దేవానంద్, వినయ విజయ్‌భాస్కర్, సుష్మావేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, సుప్రజా వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, రోజాబాల్రెడ్డి, లలితాసోమిరెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్, సింధూ ఆదర్శ్‌రెడ్డి, పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్లు నందారం నరసింహగౌడ్, రాములుగౌడ్, అమీన్పూర్ కౌన్సిలర్లు కొల్లూరు మల్లేశ్, యూసుఫ్, ఉపేందర్‌రెడ్డి, మల్లేష్, నవనీత జగదీష్, రాజేశ్వరి, కోఆప్షన్ యూనుస్, మున్సిపల్ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీ పాండు, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎండీ అఫ్జల్, మాజీ ఎంపీపీలు శ్రీశైలంయాదవ్, యాదగిరియాదవ్, సర్పంచ్‌లు మున్నూరు లక్ష్మయ్య, మాణిక్యరెడ్డి, నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు దశరథ్‌రెడ్డి, మన్నెరాజు, వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌చారి, బాసిరెడ్డి నరసింహరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నర్రాభిక్షపతి, గూడెం మధుసూదన్‌రెడ్డి, గూడెం యాదమ్మ, గూడెం విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్పస్వామికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
హాజరైన ఎంపీలు
పూజలకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, శాసనమండలి మాజీ ప్రొటెం చైర్మన్ వి భూపాల్‌రెడ్డిలు హాజరై పూజలు చేశారు. వారికి పూజారులు ప్రత్యేక ఆశీర్వాదం అందజేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, భక్తులు తరలిరావడంతో పటాన్చెరు మైత్రిమైదానం కిటకిటలాడింది. వేలాదిగా వచ్చిన భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు.
వైభవంగా అయ్యప్పస్వామి పూజలు
మండపంలో శబరిమలై అయ్యప్పస్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. అభిషేకం, కలశపూజ, పడిపూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ముందుంగా విఘ్నేశ్వర పూజ, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మొదటి నుంచి పూజల్లో పాల్గొని స్వామికి పుష్పాభిషేకంతో పాటు క్షీరాభిషేకం చేసి, స్వాముల ఆశీస్సులు పొందారు. మహిళలు భారీ సంఖ్యలో హాజరై స్వాములను దర్శించుకున్నారు.