సిద్దిపేట, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ శనివారం విడుదల చేశారు. దేశం లో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నా రు. తెలంగాణలో ఒకే సారి అన్ని స్థానాలకు నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించి ఏప్రిల్ 18ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుండగా ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చింది. నాలుగో విడతలో మే 13న పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న కౌంటింగ్ చేపడుతారు. షెడ్యూల్ వెలువడిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మెదక్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్ నుంచి బీబీపాటిల్ గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నుం చి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపొందడంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఇటీవల బీజేపీలో చేరారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలతో మెదక్ పార్లమెంట్ స్థానం విస్తరించి ఉంది.
జహీరాబాద్ పార్లమెంట్ స్థానం సంగారెడ్డి జిల్లాలోని అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, భాన్సువాడ నియోజకవర్గాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలు, భువనగిరి పార్లమెంట్ పరిధిలో జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు విస్తరించి ఉన్నాయి.
లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో గత శాసనసభ ఎన్నికల్లో అత్యధిక శాసనసభ స్థానాలను గెలిచి బీఆర్ఎస్ తన సత్తా చాటుకుంది. రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకొని సత్తా చాటాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల వారీ గా పార్టీ సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ చేసింది. జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్‌కుమార్, జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సురేశ్‌షెట్కార్, బీజేపీ నుంచి బీబీపాటిల్, మెదక్ నుంచి రఘునందన్‌రావును ప్రకటించారు.