గుమ్మడిదల, ఫిబ్రవరి 5: సంగారెడ్డి జిల్లాలో డంపింగ్ యార్డు రగడ మొదలైంది. హైదరాబాద్ జవహర్‌నగర్‌లో ఉన్న డంపింగ్ యార్డులోని చెత్తను సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతానికి తరలించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మంగళవారం రాత్రి అధికారులు, పోలీసులు గుమ్మడిదల మండలంలోని ముఖ్యనాయకులను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నాయకుల ఇంటి తలుపులు తట్టి పోలీస్ వాహనాల్లో సంగారెడ్డి జిల్లాలోని చిద్రుప్ప పోలీస్ శిక్షణా కేంద్రానికి తరలించారు. దీంతో గుమ్మడిదల, బొంతపల్లి, దోమడుగు, అన్నారం, నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇంటింటికీ పోలీస్ బలగాలు రావడంతో ప్రజలు భయం గుప్పిట్లో కాలం గడిపారు. ప్యారానగర్, నల్లవల్లి డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నిరసన వ్యక్తం చేస్తూ నల్లవల్లి రాగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. గ్రామస్తులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అటవీ ప్రాంతంలో డంపింగ్ యా ర్డు వల్ల కాలుష్యం పెరుగుతుందని, రోగాలు పెరుగుతాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లల్లో ఉన్న యువత, పురుషులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తుండటంతో మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు వద్దని తీర్మానాలు చేసినా పోలీసులతో వచ్చి డంపింగ్ యార్డు ఏర్పాటుపై కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు.
అర్ధరాత్రి డంపింగ్ యార్డుకు రోడ్డు
ఒక్కసారిగా జీహెచ్ఎంసీ నుంచి వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తీసుకొచ్చి ప్యారానగర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డుకు రోడ్డు వేస్తున్నారు. వందలాది పోలీసు పహారాలో మట్టిని తెచ్చి రోడ్డును చదను చేస్తున్నారు. ఈ తంతును చూసిన స్థానికులు ఇదేం దుస్థితి అని నివ్వెర పోయారు. అటువైపు ఎవరు రాకుండా పోలీసు బలగాల మధ్య పనులు చేయిస్తున్నారు. పొలం పనులకు వెళ్తున్న వారిని కూడా నిలువరిస్తున్నారు. దీంతో ప్యారానగర్ అటవీ ప్రాంతంలో డంపింగ్ యార్డు వద్దని గుమ్మడిదల రైతు సంఘాల నాయకులు, యువకులు, ప్రజలు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు.
పోలీసు బలగాల మోహరింపు
జీహెచ్ఎంపీ ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రజల నుంచి నిరసనలు, ఆందోళనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. మైకుల్లో గ్రామాల్లో హెచ్చరిస్తూ ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని హుకూం జారీ చేశారు. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు పోలీసుల తీరుతో పొలాల చాటున, పుట్టకొకరు, గుట్టకొక్కరు తలదాచుకున్నారు. అయినా పోలీసులు గాలిస్తూ ప్రజలను అరెస్ట్ చేశారు. ప్రజాపాలన పేరున పాలన చేపట్టిన కాంగ్రెస్ సర్కారు రజాకార్ పాలనను తీసుకొచ్చిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారుకు, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డంపింగ్ యార్డుతో తమ బతుకులు ఆగం చేయవద్దని ప్రజలు విజ్ఞప్తి చేశారు.
కొత్త రోగాలు ఖాయం
ఇప్పటికే పరిశ్రమల కాలుష్యంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని, డంపింగ్ యార్డుతో కొత్త రోగాలు రావడం ఖాయమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డును అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాలు, పంట పొలాలు, పచ్చని అడవి, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని ప్రజలు వాపోతున్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటును వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సర్కారును మండలంలోని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
యూరోపియర్ టెక్నాలజీతో యార్డు
యూరిపియన్ టెక్నాలజీతో ప్యారానగర్ అటవీ ప్రాంతంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తున్నామని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ దుర్గాప్రసాద్, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులతో నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు, సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవ్‌కుమార్, తహసీల్దార్ గంగాభవానితో కలిసి వెల్లడించారు. అక్టోబర్ 10న డంపింగ్ యార్డుకు అనుమతులు వచ్చాయని తెలిపారు. పీసీబీ ప్రపోజల్‌ను ఫిబ్రవరి 6, 2023లో అనుమతులు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ డంపింగ్ యార్డును 150 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోజూ 2 వేల టన్నుల చెత్తను హైదరాబాద్ జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి తరలించనున్నట్లు తెలిపారు. ఎలాంటి కాలుష్యం లేకుండా, కంపు రాకుండా యూరోపియన్ టెక్నాలజీతో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు చుట్టూ నాలుగు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ప్యారానగర్‌తో పాటు పటాన్‌చెరులోని లక్కడారంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ తెలిపారు.
ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, రామచంద్రాపురం బీఆర్ఎస్ నాయకుడు ఆదర్శ్‌రెడ్డి, బొల్లారం నాయకుడు కొలను బాల్‌రెడ్డి, ఆర్సీపురం కార్పొరేటర్ తొంట అంజయ్య బుధవారం మధ్యా హ్నం నల్లవల్లి గ్రామానికి వచ్చారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మండల ప్రజల ప్రజాభిప్రాయం తీసుకోకుండా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయ డం అన్యాయమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల ప్రజలతో కలిసి ఎమ్మెల్యే నిరసనకు దిగారు. వారిని పోలీసులు బీడీఎల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దంటూ కొత్తపల్లిలో యువకులు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ సర్కారును హెచ్చరించారు.