రామాయంపేట : మద్యం నేడు నిత్యావసర సరుకుగా మారిపోయింది. తాగడానికి మంచినీళ్లు దొరక్కపోయినా మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ అన్ని వేళల్లో అన్ని గ్రామాల్లో దొరుకుతుంది. ఇంటికి వచ్చే చుట్టాలకు, స్నేహితులకు టీ, కాఫీ ఇచ్చే సంస్కృతి నేడు మద్యం తాగించే సంస్కృతిగా మారిపోయింది. మధ్య తరగతి కుటుంబాలు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు పొద్దస్తమానం కాయకష్టం చేసి ఆ కష్టాన్ని మర్చిపోవడానికి వచ్చిన కూలీలో సగానికి పైగా తాగడానికే ఖర్చు చేస్తున్నారు.
మత్తుకోసం ఎంతైనా ఖర్చు చేసే కొందరు ఇంట్లో కావాల్సిన నిత్యావసర సరుకులను తెచ్చుకోవడానికి మాత్రం అంతగా ఆసక్తి కనబర్చరు. ప్రస్తుతం ఎక్కడ ఏ చోట చూసినా గల్లీగల్లీలో మద్యం అమ్మకాలు బెల్టు షాపులు కనిపిస్తున్నాయి. నేటి తరం యువత మద్యం మహమ్మారికి బలవుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మద్యం తాగుతూ ఆ మత్తులో ఏం చేస్తున్నామో తెలియకుండా కొంతమంది యువత గంజాయి మత్తులో జోగుతున్నారు. దొంగతనాలు, దోపిడీలు లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. మరికొంత మందైతే గ్రూపులుగా ఏర్పడి హత్యలు, ఆత్యాచారాలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు.
పల్లెపల్లెనా బెల్టు షాపుల్లో ఏరులై పారుతున్న మద్యాన్ని అరికట్టే నాథుడే కరువయ్యాడు. విచిత్రమేందంటే ఈ రోజుల్లో వయసు పైబడిన వారికంటే యువకులు, విద్యార్థులే అధికంగా మద్యం, గంజాయి సేవిస్తున్నారు. వీళ్ళ ఉత్సాహానికి మద్యం, బెల్టుషాపుల యాజమాన్యాలు అధిక ధరలకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. నిత్యం ఇలాగే కొనసాగుతుంది. ప్రతిరోజు డ్రంక్డ్రైవ్లో భాగంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టడమే గాకుండా మందుబాబులకు కౌన్సెలింగ్‌లు ఇస్తున్నా పరిస్థితి మాత్రం ఎక్కువవుతుందే తప్ప తగ్గడంలేదు.
బీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ హయాంలో మద్య నియంత్రణ కోసం చేయని ప్రయత్నాలు లేవు. తన అక్కాచెళ్లెల్లు ఇబ్బందులు పడద్దనే ఉద్దేశంతో తాగుబోతు భర్తలు ఇంట్లో ఆడపడుచులను హింసలకు గురిచేస్తే నేరుగా పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ ఇవ్వడం కోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా పోలీస్‌ను ఏర్పాటు చేశారు. అంతేగాకుండా గతంలో జాతీయ రహదారిపై ఉన్న దాబాలను, మద్యం షాపుల లైసెన్సులను కూడా రద్దు చేశారు. ఇంత చేసినా ఎక్కడో ఓ చోట మద్యం తాగుతూ దానికి బానిసలైన కొందరు దురాలోచనతో మత్తులో ఉండి చెడుదారి పట్టారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో మళ్లీ మద్యం ఏరులై పారుతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
ఆ మత్తులో ఉన్న కొంతమందికి వారు ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని పరిస్థితి. తాగిన మైకంలో తనవాళ్లు, ఇంటి మనుషులు అని కూడా చూడకుండా హత్యలు, అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం అక్రమంగా సిట్టింగ్‌లను నిర్వహించే వారిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రస్తుతం యువతలో చాలామందికి ఇంట్లో వాళ్ల భయం ఉండటంలేదు. ప్రభుత్వం, చట్టాలు అంటే కూడా భయం లేకుండా విచ్చలవిడిగా గంజాయికి అలవాటు పడుతున్నారు. మెదక్ జిల్లావ్యాప్తంగా ఎక్కడ ఏ మూలన చూసినా గంజాయి అమ్మకాలు జోరుగా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్నాయి. గంజాయి అమ్మకం దారులు గ్యాంగులుగా ముఠాలుగా ఏర్పడి ఒకరి నుంచి మరొకరికి ఈ అమ్మకాలను సాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పాఠశాలకు వెళ్లే చిన్నారులకు సైతం చాక్లేట్ టైప్‌లో తయారు చేసి గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. ఇంత జరిగినా ప్రస్తుత ప్రభుత్వం ఈ అమ్మకాలను అరికట్టలేక పోతుంది. ఒక్క రామాయంపేట పట్టణంలోనే 4, 5 కేంద్రాలలో ముఠాలుగా ఏర్పడి గంజాయిని సరఫరా చేస్తున్నారు.
మద్యం తాగి రోడ్డెక్కి న్యూసెన్స్ చేయాలని చూస్తే ఎంతటివారైనా జైలుకు వెళ్లాల్సిందేనని రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్ హెచ్చరించారు. రామాయంపేట సర్కిల్లోని చేగుంట, నార్సింగి, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాలలో మద్యం ప్రియులకు సిబ్బంది ద్వారా కౌన్సిలింగ్‌లు ఇస్తున్నామని చెప్పారు. మద్యం సేవించి నేరుగా ఇళ్లకే వెళ్లాలని, ఎలాంటి గొడవలకు దిగినా, రోడ్లపై ఇతరులను ఇబ్బందులకు గురిచేసినా పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేస్తామని, జైలుకు కూడా వెళ్లాల్సివస్తుందని అన్నారు. ప్రస్తుతం గంజాయి అమ్మకాలు జరుపుతున్నారని తెలిసిందని, వారి పట్ల నిఘాను పటిష్టం చేశామని చెప్పారు. అలాంటి అమ్మకాల విషయం తమ దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు చేపడుతామని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉలంఘిస్తే చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు.