గజ్వేల్, జూన్ 28: గజ్వేల్‌లో వాహనదారులకు ఆర్టీఏ అధికారుల సేవలు రెండు రోజులకే పరిమితమయ్యాయి. వారంలో మంగళ, శుక్రవారాల్లో గజ్వేల్‌లో ఎంవీఐ అందుబాటులో ఉంటున్నారు. మిగతా రోజుల్లో వాహనదారులకు ఎలాంటి పనులున్నా సిద్దిపేటలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తున్నది. డివిజన్ కేం ద్రాల్లో ఏర్పాటు చేసిన ఎంవీఐ కార్యాలయాల్లో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి రాకపోవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులే ఎంవీఐలు అందుబాటులో ఉండడంతో వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, మిగతా సేవలకు సిద్దిపేటకు వెళ్లాల్సి వస్తుండడం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. సిద్దిపేటలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే రోజంతా అక్కడే గడిచిపోతున్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గజ్వేల్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో కొత్త లైసెన్స్‌లు, లైసెన్స్‌ల రెన్యువల్, వాహనాల రిజిస్ట్రేషన్ల సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా సేవలకు సిద్దిపేటకు వెళ్లాల్సి వస్తున్నది. గజ్వేల్ డివిజన్ కేంద్రంలో పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తే గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, మర్కూక్, రాయపోల్, దౌల్తాబాద్ మండలాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. గజ్వేల్ డివిజన్ కేంద్రంలోనే కాదు హుస్నాబాద్, చేర్యాలలో ఇదే పరిస్థితి ఉం ది. ఇప్పటికైనా డివిజన్ కేంద్రాల్లో శాశ్వత కార్యాలయాలు ఏర్పాట్లు చేసి పూర్తిస్థాయిలో సేవలు అందిస్తే వాహనదారులతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.
సిబ్బంది కొరత కారణంగా ఆర్టీఏ సేవలను రెండు రోజుల పాటే అందిస్తున్నాం. గజ్వేల్‌లో వారంలో రెండు రోజుల పాటే ఆర్టీఏ సేవలు అందుతుండడంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
-క్రిస్టోఫర్, ఎంవీఐ గజ్వేల్