‘గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు.. పుస్తకాలు చదివితే విజ్ఞానం పెరుగుతుంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేటలోని కేసీఆర్‌నగర్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ‘నమస్తే తెలంగాణ’ నిర్మించిన గ్రంథాలయాన్ని సోమవారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. గ్రంథాలయానికి పుస్తకాలతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మంచి లైబ్రరీ ఏర్పాటు చేసినందుకు పత్రిక ఎండీ దీవకొండ దామోదర్‌రావు, ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, యాజమాన్యానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ లైబ్రరీ నిర్వహణ బాధ్యతలను మంత్రి మున్సిపాలిటీకి అప్పగించారు.
సిద్దిపేట రూరల్, నవంబర్ 28 : సిద్దిపేటలోని కేసీఆర్‌నగర్‌లో ‘నమస్తే తెలంగాణ’ సౌజన్యంతో నిర్మించిన లైబ్రరీని సోమవారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం భవన నిర్మాణాన్ని, పుస్తకాలను, కంప్యూటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడ నివాసం ఉంటున్న అనేక మంది పాఠకులు పట్టణంలోని గ్రంథాలయాలకు వెళ్లే శ్రమ లేకుండా ‘నమస్తే తెలంగాణ’ సహకారంతో అధునాతన గ్రంథాలయం నిర్మించడం బాగుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తోందని, గ్రంథాలయంలోని తెలంగాణ చరిత్ర పుస్తకాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. విజ్ఞానం పొం దాలంటే ఇలాంటి గ్రంథాలయతోనే సాధ్యమన్నారు. పాఠకులు లైబ్రరీని చక్కగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రంథాలయ నిర్వహణ బాధ్యతలు మున్సిపాలిటీ తీసుకుంటుందని, పాఠకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. పాఠకులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థుల్లో పాఠనాసక్తి పెంచేందుకు వీలుగా ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం అధునాతనంగా భవనాన్ని నిర్మించిందని, విశాలమైన రెండు గదుల్లో ఒకటి లైబ్రరీ, మరొకటి శిక్షణకు వినియోగించనున్నారన్నారు.
పాఠకుల కోసం ఎన్నో కథలు, నవలలు, నిరుద్యోగుల కోసం కాంపిటేటీవ్ పుస్తకాలు, వృద్ధులకు రామాయణ, మహాభారత పుస్తకాలు, ఆసక్తి ఉన్న మరింత సమాచారం తెలుసుకునేందుకు కంప్యూటర్లతోపాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. లైబ్రరీలో 750 పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉంచారు.
అత్యాధునిక సౌకర్యాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంపై ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యానికి మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. మంచి లైబ్రరీని ఏర్పాటు చేసిన నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావు, ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో కాశీనాథ్, నమస్తే తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్ సతీశ్, ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో చీఫ్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, పాల సాయిరాం, స్థానిక కౌన్సిలర్, ‘నమస్తే తెలంగాణ’ సిబ్బంది పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ చాలా బాగుందని సీపీ ఎన్ శ్వేత అన్నారు. నూతనంగా కేసీఆర్‌నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన లైబ్రరీని అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పుస్తకాలను చూశారు. విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.