పాపన్నపేట, మే 23: మెదక్ జిల్లా పాపన్నపేటలో చిరుత (Leopard) సంచరిస్తున్నది. దీంతో రైతులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం రాత్రి పాపన్నపేట శివార్లలోని వెంకటేశ్వరగుట్ట సమీపంలో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లను రైతులు గుర్తించారు. నెల రోజుల క్రితం గుట్ట అవతలి వైపు ఉన్న దౌలాపూర్ శివారులో రెండు చిరుతలు సంచరించాయి. ఈ విషయాన్ని అప్పట్లో ఫారెస్ట్ అధికారులు కూడా ధ్రువీకరించారు. అక్కడికి ఎవరు వెళ్లొద్దని రైతులకు సూచించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా శుక్రవారం తెల్లవారుజామున వెంకటేశ్వర గుట్టవైపు పొలాలున్న రైతులు వెళ్లేసరికి రెండు చిరుతపులుల పాదాల ఆనవాళ్లు కనిపించినట్లు రైతులు వెల్లడించారు. దీంతో పొలాల వైపు వెళ్లడానికి జంకుతున్నారు. ఒకటి తల్లి చిరుత, రెండోది పిల్ల చిరుత ఉన్నట్లు పాదముద్రలను బట్టి రైతులు వెల్లడిస్తున్నారు. పొలాల వైపు వెళ్లాలంటే భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత కొన్ని రోజుల క్రితం దౌలాపూర్, పాపన్నపేట గ్రామాల శివారులో చిరుత సంచరించడంతో తాము అప్పటినుంచి పొలాల వద్దకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నామని చెప్పారు. ఈ విషయం ఫారెస్ట్ అధికారులకు చెబుదామంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏ రోజూ విధులకు అయిన దాఖలాలు లేవన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించి వేరే ప్రాంతానికి తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఫారెస్ట్ అధికారి జోజీని వివరణ కోరగా.. రైతులు పులిగా భావిస్తున్నారని ఈ ప్రాంతంలో ఎక్కడా లేదన్నారు. అయితే పాపన్నపేట శివారులో సంచరించిన పాదముద్రలను బట్టి చిరుత పులై ఉంటుందని వివరణ ఇచ్చారు. సిబ్బందిని వెంటనే సంబంధిత ప్రాంతానికి పంపుతామని, రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.