చేర్యాల, నవంబర్ 25: కేంద్ర ప్రభుత్వం పదేండ్లుగా చేనేత పరిశ్రమను, చేనేత సహకార సంఘాలను కార్పొరేటీకరణ పేరుతో భ్రష్టు పట్టించిందని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ అన్నారు. చేనేత కార్మికుల స్థితిగతులు, వారు పడుతున్న ఇబ్బందులను అధ్యయనం చేసేందుకు సోమవారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో చేనేత కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాంతికుమార్ మాట్లాడుతూ..నేతన్నలు దుర్భర జీవితాలు గడుపుతూ, ఆకలికేకలతో ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తెలంగాణలో దాపురించిందన్నారు.
దీనిని ఎదురించడం కోసం చేనేత కార్మికులు సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం చేనేత పరిశ్రమను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు సిద్ధంకావడంతో చేనేత కార్మిక సంఘాలు పూర్తిగా దివాలా తీశాయన్నారు. మగ్గాల పై వస్ర్తాలు నేస్తున్న కార్మికులకు నూలు అందించే విషయంలో జాప్యం జరుగుతుండడంతో పొద్దంతా పని చేసినా గిట్టుబాటు కావడం లేదన్నారు.
సంప్రదాయంగా వస్తున్న చేనేత పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. చేనేత కార్మికుల ఉపాధి, సంక్షేమం, అభివృద్ధి కోసం బోర్డును ఏర్పాటు చేయడంతోపాటు రూ.1000కోట్లు కేటాయించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నూలు, రంగుల సబ్సిడీ పథకం, నగదు బదిలీని కొనసాగించాలని, చేనేత కార్మికుల హౌస్ కం వర్క్ షెడ్ పథకాన్ని పునరుద్ధరించాలని, ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయాలని కోరారు.
చేనేత సహకార సంఘాల్లో నిల్వ ఉన్న చేనేత వస్ర్తాలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి సమస్యలు పరిష్కరించాలని, సహకార సంఘాలకు, టెస్కోకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిసెంబర్ 10 హైదరాబాద్లో నిర్వహించే చేనేత ఆత్మీయ కలయిక కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బడుగు శంకరయ్య, రాష్ట్ర కార్యదర్శి ముష్యం నరహరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొంగరి వెంకట్మావో, పాము బాలనర్సయ్య, వెంకటేశం, చక్రపాణి, రామచంద్రం, యాదగిరి, బాలు, నర్సింహులు పాల్గొన్నారు.