అందోల్, అక్టోబర్ 14: కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతుండడంతో అనేక అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయని అందోల్ మాజీ క్రాంతికిరణ్ అన్నారు. బీఆర్ఎస్ టేక్మాల్ మండల అధ్యక్షుడు బత్తుల వీరప్ప దంపతులపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం జోగిపేటలో వీరప్ప దంపతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. తాగిన మైకంలో ఒళ్లు తెలియని స్థితిలో పెద్ద వయస్సువారు అని చూడకుండా బత్తుల వీరప్ప దంపతులపై దాడిచేయడం తగదన్నారు.
గ్రామాల్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు నడుస్తుండడంతో యు వత మత్తులో తూగుతున్నారని, విచ్చలవిడిగా మద్యం విక్రయాలే ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయని తెలిపారు. ఇలాంటి సం ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను మూసేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇంకా రెట్టింపు దుకాణాలు నడిచేలా ప్రోత్సహిస్తున్నదని దుయ్యబట్టారు. గ్రామాల్లో తాగునీళ్లు దొరకడం లేదు కానీ, రాత్రీపగలు అనే తేడాలేకుండా మద్యం లభిస్తున్నదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం, పోలీసులు స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఆయన వెంట నాయకులు నర్సింహులు, వెంకటేశం, రాజు, కరుణాకర్ ఉన్నారు.