రాయపోల్, జూన్ 23: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిఫుల్ ఆర్) అలైన్మెంట్ మార్చాలని, బలవంతంగా భుములు గుంజుకుంటే భూమికి బదులుగా మరోచోట భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఎల్కల్, బేగంపేట గ్రామాల భూ నిర్వాసితుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఆదివారం ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ తొర్రి కుమార్, ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ జగదీశ్ యాదవ్‌తో పాటు ఎల్కల్, బేగంపేట గ్రామాలకు చెందిన రైతులు ఎల్కెల్ గ్రామంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి ట్రిఫుల్‌ఆర్ నిర్మాణంలో పోతే రోడ్డున పడతామన్నారు. బతుకుదెరువు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి కోల్పోతున్న ప్రతి రైతుకు 2013 భూహక్కుల చట్టం ప్రకారం భూమికి బదులు భూమి ఇవ్వాలన్నారు. మార్కెట్ విలువ కన్నా రెండింతలు అదనంగా నష్ట పరిహారం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలన్నారు. చాలామందికి వ్యవసాయ భూమి తక్కువగా ఉందని, ఆ భూముల్లోనే కూరగాయలు పండించి బతుకుతున్నామని, తమ నోటికాడి బువ్వను ప్రభుత్వం గుంజుకుంటే తాము బతికేది ఎట్లా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఉప సర్పంచ్ స్వామి, నాయకులు తొర్రి మల్లేశం, సురేశ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.