సిద్దిపేట, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): భూముల క్రయవిక్రయాల సమయంలో నలుగురు పెద్ద మనుషలు మధ్యన తెల్లకాగితం లేదా స్టాంప్ పేపర్ రాసుకొని జరిగిన లావాదేవీల ఒప్పంద పత్రమే సాదాబైనామా. ఈ సాదాబైనామా అమ లు కోసం కండ్లు కాయ లు కాసేలా రైతులు ఎదురుచూస్తున్నారు. ఇవాళ మోక్షం కలిగేనా..? రేపు మో క్షం కలిగేనా.. అని ఎదురుచూపులే తప్పా పనులు కావడం లేదు అని అర్జీదారు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాగితం తీసుకురా… ఆ కాగితం తీసుకురా.. అంటూ ఆఫీసుల చుట్టూ అధికారులు తిప్పకుంటున్నారు తప్పా పనులు కావడం లేదని రైతులు వాపోతున్నారు.
దరఖాస్తు చేసుకున్న వారికి నోటీసులిచ్చి సర్వే చేస్తున్న మాటే కానీ, పరిష్కారం మాత్రం కావడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 43,318 సాదాబైనామా దరఖాస్తులు వస్తే, ఇంత వరకు ఒక్కటీ పరిష్కారం కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సక్రమంగా ఉన్న భూములపై 2016,2017లో హక్కులు కల్పించింది. తర్వాత 2020లో సాదాబైనామాల పరిష్కారానికి 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించింది. వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటిని అప్పట్లోనే అధికారులు పరిష్కరించారు. కొన్ని ప్రాథమికంగానే తిరస్కరించారు.
గతంలో రైతులు తెల్ల కాగితాలపై వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు జరిపించారు. నిరక్షరాస్యత కారణంగా,రిజిష్టర్ డాక్యుమెంట్ కావాలంటే ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో రైతులు కొందరు తెల్లకాగితాలపై రాసుకున్నారు. వీటితోనే భూ యాజమాన్య హక్కులు పొందారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాదాబైనామా అమలు విషయంలో అనేక కొర్రీలు పెట్టింది. ప్రస్తుతం భూభారతి చట్టంలో సాదాబైనామాల పరిష్కారానికి 2020లో దరఖాస్తు చేసి ఉండాలని చెప్పింది. అమలు చేయడం చేతకాక కొర్రీలు పెట్టి కాలయాపన చేస్తున్నది తప్పా పరిష్కారం మార్గం చూపడం లేదు.నిబంధనలు కఠినతరం చేయడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు.సాదాబైనామా అమలుకు అమ్మిన వ్యక్తి అఫిడవిట్ కావాలని అడగడంతో అసలు సమస్య ఏర్పడుతున్నది.
ఇరువర్గాల నుంచి అఫిడవిట్ అడగడంతో సమస్య మరింత జఠిలం అవుతున్నది. అమ్మిన వ్యక్తి చనిపోతే అఫిడవిట్ తీసుక రావడం ఎలా సాధ్యమైతుంది. పైగా వారసులు ఉంటే వారు తామేలా సంతకం పెడుతామని అంటున్నారు.గతంలో ఉన్న ధరణి చట్టం స్థానంలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చింది.సమస్యల పరిష్కారానికి 2020లోగా దరఖాస్తు చేసుకొని ఉండాలని,12 ఏండ్లుగా ఆ భూమిలో అనుభవదారుడై ఉండాలని చెబుతున్నది. సమస్య పరిష్కారమయ్యేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును కట్టాలంటున్నది.ఎన్నికల సమయంలో ఉచితంగా రెగ్యులర్ చేస్తామని చెప్పి తీరా ఇప్పుడు మరోలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సాదాబైనామా పరిష్కరించి 13బీ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటే అంత ప్రభుత్వానికి చెల్లించాలని షరతు పెట్టింది.సాదాబైనామా విచారణ సందర్భంగా కొన్న వ్యక్తితో పాటు అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి.
దీంతో చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతున్నా ఇంత వరకు ఏ ఒక్క దరఖాస్తును పరిష్కరించలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి సిద్ధం చేసుకొని పెట్టుకోవాలని మాత్రమే అధికారులకు ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూముల రెగ్యులరైజేషన్కు బీఆర్ఎస్ హయాంలో నెలరోజుల పాటు దరఖాస్తుల స్వీకరించింది. అప్పటి దరఖాస్తులకు ప్రస్తుతం ప్రభుత్వం నోటీసులు జారీచేసి రైతుల నుంచి కొనుగోలు వివరాలను సేకరిస్తున్నది. రైతుల వద్ద ఉన్న ఆధారాలను గ్రామాలలో జీపీవోలు సేకరిస్తున్నారు.
ఆధారాలు సేకరించిన తర్వాత అధికారులు ఫీల్డ్ ఎంక్వయిరీ చేసి ఆర్డీవోకు రిపోర్టు పంపి, భూములను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారే తప్పా పరిష్కార మార్గం కనిపించడం లేదు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేయడం ఒకసారి, వాటి పరిశీలన మరోసారి,అనంతరం ఫీల్డ్ విచారణ ఇలా కాలయాపన చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకొంటుందని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అమ్మిన వ్యక్తుల వాదనను వినడంతో రైతులకు లాభం జరగదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మిన వ్యక్తులతో సంబంధం లేకుండా మోకా ఎంక్వయిరీ చేసి సాదాబైనామాలను క్రమబద్ధీకరిస్తే బాగుంటుందని, లేకపోతే దీని వల్ల ప్రయోజనం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెల్లకాగితంపై రాసుకొని క్రయవిక్రయాలు చేపట్టిన వారు 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో వేలసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీటిలో చాలావరకు దరఖాస్తులను తిరస్కరించారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో 13,175, సంగారెడ్డిలో 23,996, మెదక్లో 12,404 వరకు సాదాబైనామా దరఖాస్తులను కొత్త చట్టం ప్రకారం ఆర్డీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ బృందాలు క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తున్నాయి.తొలుత వివాదాలు లేని భూములకు సాదాబైనామాల ద్వారా హక్కులు కల్పించాలి. కానీ, క్ల్లియర్గా ఉన్న వాటికి కూడా ఇంత వరకు హక్కులు కల్పించకుండా కాలయాపన చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం నుంచి వీటిపై స్పష్టత లేదు. ఫైల్ సిద్ధం చేసి పెట్టుకోండి అని చెప్పినట్లు రెవెన్యూ అధికారులు కొందరు చెబుతున్నారు.
చౌటకూర్, అక్టోబర్ 17: మండల కేంద్రమైన చౌటకూర్ శివారులోని సర్వే 1592లో 16 గుంటల భూమిని పట్టా చేయాలని ఏండ్ల తరబడి తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా. 18 ఏండ్ల క్రితం గ్రామానికి చెందిన రైతు వద్ద భూమి కొన్నాను. సాదాబైనామా రాసుకుని అమలు కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నాను. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పనికావడం లేదు. 16 గుంటల భూమి సాదాబైనామాది నా పేరుమీద చేసేందుకు అధికారుల కాళ్లావేళ్ల పడుతున్నాను. అయినప్పటికీ, అధికారులు కనికరించడం లేదు. భూభారతిలో సదస్సులో దరఖాస్తు చేశాను. ఇప్పటి వరకు అతీగతి లేదు.
– బరత్పల్లి మల్లప్ప, రైతు, చౌటకూర్ (సంగారెడ్డి జిల్లా)