జహీరాబాద్, జూలై 26: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిమ్జ్ ప్రాజెక్టు భూసేకరణ ముందుకు సాగడం లేదు. భూసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. భూనిర్వాసితుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల నిమ్జ్ భూసేకరణ ప్రాజెక్టు కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడిచేసి, పలువురు అధికారులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఏసీబీ దాడులతో నిమ్జ్ ప్రాజెక్టులో భూసేకరణ, పరిహారం చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో నిమ్జ్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిమ్జ్‌లో పరిశ్రమల ఏర్పాటుపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి.
నిమ్జ్ ప్రాజెక్టు కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో 17 గ్రామాల్లో 12,635.14 ఎకరాల్లో దాదాపు 7,300లకు పైగానే భూసేకరణ బీఆర్ఎస్ హయాంలోనే పూర్తిచేశారు. ఇందులో మొదటి దశలో 3,909 ఎకరాల్లో ఇండస్ట్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ మొత్తం భూమిని సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇదివరకే కొన్ని పరిశ్రమలకు భూములను కేటాయించారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు అప్పగించిన వెంటనే ప్రతిపాదిక లేఔట్ ప్రకారం పారిశ్రామిక అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందన్నారు.
దీనికోసం ఈనెల 9న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో నిమ్జ్ ప్రాజెక్టు అధికారులతో పాటు ఆయా మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కలెక్టర్ తెలిపారు. మొదటి విడతలో ఝరాసంగం మండలంలో 3,240 ఎకరాలకు 2,888 ఎకరాల భూమిని సేకరించారు. మిగిలిన 378 ఎకరాల భూమిని మండలంలోని చిలేపల్లి, ఎల్గోయి, బర్ధిపూర్ గ్రామాల్లో సేకరించాల్సి ఉంది.
ఆయా గ్రామాల్లో భూనిర్వాసితులు, ప్రజలతో చర్చించి నిబంధనల ప్రకారం భూసేకరణ పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ దశలోనే ఏసీబీ అధికారులు నిమ్జ్ ప్రాజెక్టు కార్యాలయంపై దాడిచేసి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్డీవో కారు డ్రైవర్లను పట్టుకున్నారు. ఫలితంగా భూసేకరణ పూర్తిగా నిలిచిపోయింది. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు స్తంభించిపోయాయి. మొదటి విడత, రెండో విడతలో భూసేకరణ చేపట్టాలంటే నిమ్జ్ ప్రాజెక్టుకు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను నియమించాల్సి ఉంది. ప్రస్తుతం జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డికి నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ అదనపు బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం ఆర్డీవోగా, మున్సిపల్ ప్రత్యేకాధికారిగా ఆయన కొనసాగుతున్నారు. నిమ్జ్ ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్లు లేకపోవడంతో ఆయా మండలాల్లో భూ సేకరణ నిలిచిపోయింది. భూములు కోల్పోయిన బాధిత రైతులకు పరిహారం చెల్లింపులు నిలిచిపోయాయి. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను నియమించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోని పారదర్శకంగా భూసేకరణ చేపట్టి, అవినీతి అక్రమాలు లేకుండా పరిహారం చెల్లించేలా చూడాలని ఆయా మండలాలకు చెందిన రైతులు కోరుతున్నారు.