పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం కరీంనగర్ ఉమ్మడి జిల్లాపైనా పడుతున్నది. ప్రధానంగా ఎల్పీజీ గ్యాస్, డీజిల్‌పై ప్రత్యక్షంగా.. పరోక్షంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వినియోగదారులు భయాందోళన చెందుతుండగా, ఒక్కసారిగా గ్యాస్ బుకింగ్‌లు పెరుగుతున్నాయి. అయితే డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయలేని పరిస్థితి ఉండగా.. ఏజెన్సీలు, కంపెనీలు నిశిత పరిశీలన చేస్తూ ఆంక్షలు విధిస్తున్నాయి. ఫలితంగా పలుచోట్ల ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అలాగే గతంలో బంకుల్లో డీజిల్, పెట్రోల్ విక్రయాలను ఎక్కువగా ప్రోత్సహించిన కంపెనీలు, గడిచిన మూడు రోజులుగా విక్రయాలను తగ్గించాలని సూచిస్తూ నిర్వాహకులకు ఇచ్చే సబ్సీడీలు ఎత్తివేశాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికిప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే మున్ముందు కొరత తీవ్రమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.
కరీంనగర్, మార్చి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్పీజీ గృహ కనెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం 8.85 లక్షలున్న కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 10.80 లక్షలకు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వాణిజ్య సిలిండర్ల పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. గతంలో 2.08 లక్షల కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 2.62 లక్షలకు చేరింది. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి పెట్రో ఉత్పత్తుల దిగుమతికి ఆటంకాలు ఏర్పడడం, ఇదే పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం.. నాలుగు రోజుల క్రితమే ధరలు పెంచింది. గృహ వినియోగ సిలిండర్‌పై 60, వాణిజ్యసిలిండర్పై 114 పెంచడంతోపాటు పెరిగిన రేట్లను అదే రోజు నుంచి అమల్లోకి తెచ్చింది. దీని వల్ల ఉమ్మడి జిల్లా వినియోగదారులపై నెలకు దాదాపు 9.50 కోట్ల భారం పడునున్నది.
యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ సరఫరాలో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ల కొరత పెరిగింది. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులుంటే హోటళ్లు మూసివేయాల్సి వస్తుందని యాజమాన్యాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే డిమాండ్‌కు సరిపడా కమర్షియల్ సిలిండర్లు లేకపోవడం, సరఫరా చేసే అవకాశాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ ప్రభావం గృహ కనెక్షన్లపైనా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎల్పీజీ కొరత లేదని అధికారులు చెబుతున్నా.. యుద్ధం తీవ్రం అవుతున్న నేపథ్యంలో కచ్చితంగా కొరత ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు భయాందోళనకు గురవుతున్నారు. సిలిండర్లు బుక్ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈక్రమంలో బుకింగ్‌ల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతున్నది. గత గణాంకాల ప్రకారం చూస్తే.. ఉమ్మడి జిల్లాలో నెలలో 4 నుంచి 5 లక్షల సిలిండర్లు బుక్ అయ్యేవి. సగటున రోజుకు 15 నుంచి 16 వేల కనెక్షన్లు బుక్ అయ్యేవి. కానీ, గడిచిన నాలుగు రోజులుగా రోజుకు 25వేల పైచిలుకు బుకింగ్ అవుతున్నట్టు ఆయా గ్యాస్ కంపెనీలు ఏజెన్సీల ద్వారా తెలుస్తున్నది. గతంలో ఒక సిలిండర్ పూర్తయిన తర్వాత బుక్ చేసుకునేవారు. ప్రస్తుతం సిలిండర్ పూర్తి కాకముందే ముందు జాగ్రత్తగా గ్యాస్ బుక్ చేసుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే డిమాండ్‌కు అనుగుణంగా గ్యాస్ సరఫరా లేక బుక్ కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. సరఫరా విషయంలో ఇప్పటికే కంపెనీలు, ఏజెన్సీలు పలు నిబంధనలు పెట్టాయి. ఒక సిలిండర్ కనెక్షన్ ఉన్న వారు 21 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలని, అలాగే రెండు సిలిండర్లు ఉన్న వారు 30 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఆ ప్రకారం బుక్ చేసినా సీరియల్ సంఖ్యను బట్టి డెలివరీ ఉంటుందని చెబుతున్నాయి. ఈ నిబంధన ఉమ్మడి కుటుంబాలు, ఎక్కువ కుటుంబ సభ్యులున్న కుటుంబాలకు ఇబ్బందిగా మారుతున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతానికి గ్యాస్ కొరత లేదని, కానీ, నిబంధనలు మాత్రం అమలు చేయక తప్పదని ఉమ్మడి జిల్లాలోని పౌరసరఫరా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్నీ కంపెనీల బంకులు దాదాపు 450 వరకు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం.. ప్రతిరోజూ ఉమ్మడి జిల్లాలో 6 లక్షల లీటర్ల పెట్రోల్, 10 లక్షల లీటర్ల డీజిల్ వరకు విక్రయాలు జరుగుతున్నాయి. నిజానికి ఇంకా వీలైనంత ఎక్కువ విక్రయించడానికి ఇన్నాళ్లూ ఆయా కంపెనీలు బంకు యజమానులకు వివిధ రకాల స్కీంలను అమలు చేశాయి. కానీ, మూడు రోజులుగా ఆ స్కీములను ఎత్తివేశాయి. దీనికి కారణం ఆయా కంపెనీలు వీలైనంత మేరకు.. డీజీల్ విక్రయాలను తగ్గించే దిశగానే ఆలోచనలు చేస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పరిశ్రమలను డీజిల్ కొరత వెంటాడుతున్నది. వాహనాలపై కూడా ఇప్పుడిప్పుడే ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తున్నది. పరిస్థితి ఇలానే ఉంటే మరో మూడు నాలుగురోజుల్లో డీజిల్ ప్రభావం ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయని యజమానులు చెబుతున్నారు.