పటాన్చెరు, జూన్ 24 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న ఇంద్రేశం, జిన్నారం గ్రామా లను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్కు సమీపంలో ఉండడంతో పాటు ఇప్పుటికే హెచ్ఎండీఏ పరిధిలో పటాన్చెరు, జిన్నారం మండలాలు ఉన్నాయి. పటాన్ చెరు మండలంలో ఉన్న ఇంద్రేశం ఇప్పుటికే పట్టణంగా అభివృద్ధి చెందింది. జనాభా పెరగడంతో ప్రజలకు మౌలిక సదుపాయాలు కలిపించేందుకు కొత్తగా రెండు మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడంతోపాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేస్తూ మంత్రి మండలి ఆమోదించింది.
కొత్తగా కాలనీలు ఏర్పాటు కావ డం..ప్రజలకు సౌకర్యాలు కలిపించడంలో పంచాయతీలు విఫలమయ్యాయి. దీంతో ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పటాన్చెరు మండల పరిషత్ కార్యాలయం పరిధిలో ఉన్న గ్రామాలు తెల్లాపూర్, ఇస్నాపూర్, ఇంద్రేశం మున్పిపాలిటీలో విలీనం కావడంతో మండల పరిషత్ కార్యాలయం ఎత్తివేస్తారని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న అమీన్పూర్, పటాన్చెరు మండల పరిషత్ కార్యాలయాలు కనుమరుగు కానున్నాయి. గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకాదు. దీంతో పేదకూలీలు ఉపాధి పనులకు దూరంకానున్నారు.
మున్సిపాలిటీగా ఇంద్రేశం
ఇంద్రేశాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం మంత్రిమండలి ప్రకటించింది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో ఐనోల్, బచ్చుగూడ, రామేశ్వరంబండ, చిన్నకంజర్ల, పెద్ద కంజర్ల గ్రామ పంచాయతీలను విలీనం చేయనున్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 25వేలకు పైగా ఓటర్లు ఉంటారని అధికారులు తెలిపారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీ అప్గ్రేడ్ చేస్తూ ఆమోదం
ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేస్తూ మంత్రి మండలి ఆమోదించింది. పటాన్చెరు మండలంలో ఉన్న రుద్రారం, లక్డారం, భానూర్, నందిగాం, క్యాపారం గ్రామాలను ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేసి అప్ గ్రేడ్ చేసేందుకు ఆమోదించారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 40 వేలకు పైగా ఓటర్లు ఉంటారని అధికారులు వివరించారు.
పారిశ్రామికంగా ఇస్నాపూర్ అభివృద్ధి
రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాశమైలారం పారిశ్రామికవాడకు దేశంలో గుర్తింపు ఉంది. ఈ పారిశ్రామికవాడలో దేశంలోని పలు రాష్ర్టాలకు చెందిన కార్మికులు పనిచేస్తారు. ఈ ప్రాంతాన్ని మినీ ఇండియాగా పిలుస్తారు. కొందరు ఇక్కడ ఇండ్లు నిర్మాణం చేసుకొని ఉంటున్నారు. పాశామైలారం పారిశ్రామికవాడలో పలు రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేసిన వస్తువులు విదేశాలకు, దేశంలోని పలు రాష్ర్టాలకు ఎగుమతి చేస్తారు.
జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో విలీనం చేసే గ్రామాలు
జిన్నారం గ్రామాన్ని కొత్తగా మున్సిపాలిటీ చేయనుండగా నలతూర్, శివానగర్, సోలకపల్లి, ఊట్ల , జంగంపేట , కొడకంచి , రాళ్లకత్వ, అండూర్, మంగంపేట విలీనం కానున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 15252 మంది ఉండగా ప్రసుత్తం 17956 జనాభా ఉందని అధికారులు తెలిపారు. ఇప్పుటికే ప్రభుత్వం జిన్నారం మండలంలో ఉన్న కొన్ని గ్రామాలను గడ్డపోతారం మున్సిపాలిటీలో విలీనం చేసింది.