గుమ్మడిదల, జనవరి 11: కాలుష్య సమస్య పరిష్కరించకుంటే బల్దియా ఎన్నికలు బహిష్కరిస్తామని కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా దోమడుగు పట్టణంలోఆదివారం కేవీపీసీ కమిటీ కన్వీనర్లు మెంగని మంగయ్య, బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దోమడుగులోని నల్లకుంట చెరువు కలుషితానికి కారణమైన పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పీసీబీ అధికారులు నల్లకుంట ఎగువభాగంలో ఉన్న పరిశ్రమనే కాలుష్యానికి కారణమని నిర్ధారణలో తేటతెల్లమైందన్నారు.
పీసీబీ ఆదేశాల మేరకు సదరు పరిశ్రమ నిబంధనలకు లోబడి చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. నెల రోజుల్లో పూర్తిగా పీసీబీ నిబంధనలు పాటించకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆరు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా సదరు పరిశ్రమ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. నీటిశుద్ధి చర్యలు తీసుకోకపోవడంతో పంటలు సాగు చేసిన రైతులు, పాడిని నమ్ముకున్న కర్షకుల పశువులు అనారోగ్యాలకు గురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమడుగు పట్టణ ప్రజలను కాలుష్యం నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేవీపీసీ కమిటీ సభ్యులు జైపాల్‌రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, స్వేచ్ఛారెడ్డి, బాలుగౌడ్, జయమ్మ పాల్గొన్నారు.