ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం, నక్షత్రవనం
వనంలో 116 రకాల మొక్కలు
నక్షత్రాలు, రాసులను బట్టి నాటిన మొక్కలు
ఆదర్శంగా ఫాంపాండ్ నిర్మాణం
సిద్ధమవుతున్న క్రీడా మైదానాలు
సంగారెడ్డి అర్బన్, జూన్20: సంగారెడ్డి మండలంలోని కులబ్గూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచి, మోడల్ పంచాయతీగా పేరు గడిస్తున్నది. అన్ని విధాల పనులు చేపడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఆకట్టుకుంటున్నది. నాటిన ప్రతి మొక్కపై శ్రద్ధ వహిస్తూ వాటి ఎదుగుదలకు కృషి చేయడంతో తుండంతో అ ప్రకృతి వనంలో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. ఈ వనంలో 116 రకాల మొక్కలు నాటి, వాటిని పూర్తిస్థాయిలో సంరక్షించారు. ప్రకృతి వనం ఎదుట నాటిన మొక్కల పేర్లను ప్రదర్శించడంతో అక్కడికి వెళ్లిన వారందరూ వాటి జాతులు తెలుసుకుంటున్నారు. వనంలో ఆయుర్వేద మొక్కలు ఉండడం విశేషం. దీంతో పాటు పంచాయతీ పరిధిలో మరో రెండు ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. అందులో పిల్లలకు ఆట విడుపుగా ఉయాల తదితర ఆట సామాగ్రిని ఏర్పాటు చేశారు.
మొక్కల జాతులను తెలుపుతూ ఏర్పాటు చేసిన బోర్డు
అతి సుందరం నక్షత్ర వనం
సంగారెడ్డి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా నక్షత్రవనాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో 27 నక్షత్రాలు, 12 రాసులను బట్టి మొక్కలు నాటారు. ఇందులో 6 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలు దొరకలేదు. దీంతో వాటిని తెప్పించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. నక్షత్ర వనం చుట్టూ 1500 మొక్కలు నాటనున్నారు. ప్రకృతి వనం, నక్షత్రవనం మధ్యలో నిర్మించిన ఫాంపాండ్ ముచ్చటగొల్పుతున్నది. ఫాంపాండ్ నీటితో నిండుకుండలా కళకళలాడుతున్నది. పంచాయతీలో మోడల్ మార్కెట్ కూడా నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం 70 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
నక్షత్ర వనంలో నిర్మించిన ఫాంపాండ్
సిద్ధమైన క్రీడా మైదానాలు
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పంచాయతీల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా కులబ్గూర్, హనుమాన్‌నగర్ పంచాయతీల్లో ఎకరం స్థలంలో క్రీడా మైదానాలను అధికారులు సిద్ధం చేశారు. ఎకరం స్థలంలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, లాంగ్‌జంప్ కోర్టుతో పాటు వ్యాయమం చేసేందుకు సింగిల్, డబుల్ బార్లు సిద్ధమయ్యాయి. ఉపాధి నిధులతో ఒక్కో క్రీడా మైదానానికి సుమారు రూ.4.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. కీడ్రా మైదానంలో పచ్చదనం పెంచేందుకు మైదానం చుట్టూ 500 మొక్కలు నాటుతున్నారు.
టూరిస్టు స్పాట్‌కు అర్హత
కులబ్గూర్ పంచాయతీలో డంపింగ్‌యార్డ్, వైకుంఠధామం, మోడల్ మార్కెట్ పూర్తయ్యాయి. ప్రకృతివనం, నక్షత్రవనం, ఫాంపాండ్, క్రీడామైదానం అన్ని ఒకే చోట ఉండడంతో ఆహ్లాదకరాన్ని పంచుతున్నది. సంగారెడ్డికి చేరువలో ఉన్నందున టూరిస్ట్ స్పాట్‌గా ఏర్పాటు చేసేందుకు కూడా అర్హత ఉంది. ఫాంపాండ్ ఏర్పాటుతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. దీంతో పాటు జీవరాసుల దాహార్తి తీరుతున్నది.
– ఆకుల రవీందర్, ఎంపీడీవో, సంగారెడ్డి
పథకాలతోనే అభివృద్ధి
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మా గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ పథకాలన్నీ సద్వినియోగం చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి పనులు చేస్తాం. ఈ హరితహారంలో లక్ష మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకున్నాం. నర్సరీలో 60 వేల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మరో 40వేల మొక్కలు బయటి నుంచి తెపిస్తాం. సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ పనులు పూర్తి చేశాం.
– ఎండీ ఆశం, ఉప సర్పంచ్, కులబ్గూరు