వట్పల్లి, ఏప్రిల్ 6 : సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో రోడ్డు విస్తీర్ణ పనులతో ఉపాధి కోల్పోతున్న స్థానికులకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. ఆదివారం వట్పల్లిలో ఆయన పర్యటించారు. రోడ్డు విస్తరణతో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అభివృద్ధి జరగడం అందరికీ అవసరమేనని, కానీ.. ఉపాధి కోల్పోతున్న వారికి అండగా నిలవాలన్నారు. రోడ్డు విస్తరణ, డివైడర్ల ఏర్పాటుతో 60 ఏండ్లుగా రోడ్డు పక్కల ఉపాధి పొందుతున్న కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయని, వారికి ప్రభుత్వం జీవనోపాధి చూపాలన్నారు.
వారిని రోడ్డున పడేసి వదిలేస్తామంటే సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డివైడర్ నిర్మించాలని అనుకున్నామని, స్థానికులు ఉపాధి కోల్పోతారనే ఉద్దేశంతో విరమించుకున్నటు క్రాంతికిరణ్ తెలిపారు. ఈ విషయం ఇక్కడి ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఇదే విషయంపై వారం క్రితం మంత్రి దామోదర రాజనర్సింహ వద్దకు బాధితులు వెళ్లగా, ఆయన ఆగ్రహంతో తిట్టి పంపించారని బాధితులు కన్నీళ్లు పెట్టుకోవడంతో వారిని ఓదార్చి ధైర్యం చెప్పానన్నారు. మంత్రి అలా వ్యవహరించడం తగదన్నారు. తమ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన రోడ్లను నేటికి ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. కానీ, ఇప్పుడు కొత్తగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ, హడావిడి చేస్తున్నారని విమర్శించారు.