గుమ్మడిదల, ఏప్రిల్ 11: సంగారెడ్డి జల్లా ప్యారానగర్లో డంపింగ్‌యార్డు(ఎంఎస్‌డబ్ల్యూ) వద్దంటూ నల్లవల్లి, కొత్తపల్లి గ్రామస్తులు శుక్రవారం గుమ్మడిదల తహసీల్ కార్యాలయానికి తరలివచ్చి ఆర్డీవో రవీందర్‌రెడ్డికి, తహసీల్దార్ పరమేశ్‌కు వినతి పత్రాలు అందజేశారు. వృద్ధులు, దివ్యాంగులు సైతం తరలివచ్చారు. సుమారు 1190 మంది వరకు డంపుయార్డు వ్యతిరేకిస్తూ వ్యక్తిగతంగా వినతి పత్రాలు అందజేశారని తహసీల్దార్ వెల్లడించారు. డంపుయార్డుపై అభ్యంతరాలు తెలపాలని ఈనెల 3న తహసీల్దార్ నల్లవల్లి గ్రామ పంచాయతీలో నోటీస్ అతికించారు.
15 రోజుల్లోపు అభ్యంతరాలు తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో శుక్రవారం నల్లవల్లి, కొత్తపల్లి గ్రామస్తులు ఒక్కచోటకు చేరుకుని అభ్యంతరాలు తెలిపిందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐలు నయీముద్దీన్, లాలూనాయక్, ఎస్సైలు మహేశ్వర్‌రెడ్డి, నాగలక్ష్మి పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వందల సంఖ్యలో ప్రజలు ట్రాక్టర్లపై రావడానికి యత్నించడంతో పోలీస్ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డంపింగ్ యార్డుపై అభ్యంతరాలు తెలియజేయాలని రెవెన్యూ అధికారులు సూచిస్తే, పోలీసులు వచ్చి అడ్డుకుంటున్నారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడ్డారు. అదనపు ఎస్పీ సంజీవరావు నల్లవల్లికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు.
శాంతియుతంగా అభ్యంతరాలను తెలియజేస్తామని గ్రామస్తులు హామీ ఇవ్వడంతో పోలీస్ అధికారులు వెనక్కి తగ్గారు. కాగా, డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నల్లవల్లి, కొత్తపల్లి, గుమ్మడిదలలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 66వ రోజుకు చేరుకున్నాయి. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, మాజీ సర్పంచ్‌లు దోమడుగు శంకర్, బానోతు ఆంజనేయులు, రైతు జేఏసీ నాయకులు సద్ది విజయభాస్కర్‌రెడ్డి, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, పి.వేణు, పి.శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్, మన్నె రామకృష్ణ, కొరివి సురేశ్, కుమ్మరి ఆంజనేయులు, కొత్తపల్లి మల్లేశ్‌గౌడ్, చాపల మధు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.