చేగుంట, జూన్ 12: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా నడుస్తున్నదని, మంత్రుల జాడ లేకుండా పోయిందని, పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో గురువారం వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చేగుంట ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, ఆలయ కమిటీ, బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామశర్మ దివ్యాశీస్సులతో వైదిక నిర్వాహకులు గౌరీబట్ల నాగరాజుశర్మ, ఆలయ పూజారి గోవింద్ త్రిపాఠి ఆధ్వర్యంలో విశేష పూజలు, అన్నప్రసాదం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు.
అనంతసాగర్ సరస్వతీ క్షేత్ర ధర్మాధికారి బ్రహ్మాశ్రీ అష్టకాల విద్యామనోహర శర్మ పాల్గొని భక్తులకు ధార్మిక ప్రవచనాలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణశాఖ అధ్యక్షుడు తొడుపునూరి నాగరాజు, మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై అన్నివర్గాల ప్రజల అసంతృప్తిగా ఉన్నట్లు విమర్శించారు. ఇంకా మూడేండ్లు ఎలా గడుస్తాయో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ హయాంలో అన్నివర్గాల సంక్షేమానికి కేసీఆర్ కృషిచేసినట్లు గుర్తుచేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం, వ్యవసాయ సీజన్ మొదలైనా జిల్లా మంత్రులు సమీక్షలు నిర్వహించలేదన్నారు. వానకాలం వచ్చినా ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని, రైతు సంక్షేమాన్ని రేవంత్ విస్మరించారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుయ్యబట్టారు. ఇందిరమ్మ ఇల్లు 60గజాల్లోపే నిర్మించుకోవాలనే ప్రభుత్వ నిబంధనతో చాలామంది ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదన్నారు.
రాజీవ్ యువ వికాసం అమలు పత్తాలేకుండా పోయిందన్నారు. గ్రామాల్లో పాలన పడకేసిందన్నారు. పచ్చదనం, శుభ్రత కోసం గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేస్తే, వాటికి డీజిల్ పోయలేక పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవోలకు తాళాలు అప్పగిస్తు న్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, హనుమయ్య, బాలేశం, నాగభూషణం, రాజేశ్వర్, వేణు, రాఘవ, నర్సింహులు, బచ్చు రమేశ్, కిరణ్, మహేశ్, ఎర్ర యాదగిరి, ఇమ్మడి లక్ష్మణ్, జీవన్‌రెడ్డి, బండి విశ్వేశ్వర్, రాజు, నాగరాజు, శ్రీకాంత్, భక్తులు పాల్గొన్నారు.