మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), అక్టోబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడి వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాకలో పలు కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్‌కు వెళ్తూ అక్బర్పేట-భూంపల్లి మండలం ఖాజీపూర్ గ్రామ శివారులో రోడ్డుపై రైతులు నూర్పిళ్లు చేస్తున్న మొక్కజొన్న కంకులను, ధాన్యాన్ని ఆగి పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్వాకం కారణంగా వాన కాలంలో రైతులు వేసిన మొక్కజొన్న పంటకు సరైన సమయంలో యూరియా అందక పంట సరిగ్గా దిగుబడి రాలేదన్నారు.
గతంలో రైతులు పండించిన మొక్కజొన్నకు కేసీఆర్ ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసినట్లు గుర్తుచేశారు. నేడు పల్లెల్లో ఎక్కడామొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయక పోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తున్నదని, క్వింటాల్‌కు రూ.1800కే దళారులు కొంటున్నారని తెలిపారు. దీంతో రైతులు నష్టపోతున్నట్లు తెలిపారు.ప్రభుత్వం మార్క్‌ఫెడ్, ఐకేపీ ద్వారా మొక్కజొన్నల కేంద్రాలను ఏర్పాటు చేసి సేకరించాలని కోరారు. ఎమ్మె ల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పంజాల శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, నర్సింహులు తదితరులు ఉన్నారు.