దుబ్బాక,జూన్ 25: ‘మా నీళ్లు ..మాకు కావాలి…మన మల్లన్నసాగర్.. మన దుబ్బాక” అనే నినాదంతో రైతులతో కలిసి సాగునీటి కోసం ఉద్యమం చేపడుతామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ శివారులో (పెద్దగుండవెల్లి కమాన్ వద్ద) 12 గ్రామాల రైతులు సాగునీటి కోసం జలసాధన పేరిట రైతు సదస్సు నిర్వహించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి ఇర్కోడు లిప్ట్ ఇరిగేషన్ పైపులైన్ పనులు పూర్తికాక నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండలాల్లో సాగునీటి సమస్య నెలకొందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇర్కోడు ఎత్తిపోతల పైపులైన్ పనులు చేపట్టి సాగునీటి సమస్య పరిష్కరించాలని పలువురు రైతు నాయకులు డిమాండ్ చేశారు.
అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కేసీఆర్ కృషి ఫలితమే కాళేశ్వరం, మల్లన్నసాగర్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా దుబ్బాక, సిద్దిపేట ,గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన 24 గ్రామాల రైతులకు సాగునీరు సరఫరా చేసేందుకు ఇర్కోడు వద్ద లిప్ట్ఇరిగేషన్ పైపులైన్ కోసం రూపకల్పన చేసినట్లు తెలిపారు.
85 శాతం పనులు పూర్తికాగా ఇంకా మిగిలిన 15 శాతంపనులు పూర్తిచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈవిషయంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విన్నవించినా ఫలితం లేదన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మల్లన్నసాగర్ నీరు సరఫరా చేసే వరకూ పోరాటం ఆగదన్నారు. రైతులకు సాగునీరు అందించడమే తన లక్ష్యమన్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. సాగునీటి కోసం అవసరమైతే మరోనీటి ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
లిప్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తే దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండలాల్లోని పెద్దగుండవెల్లి, తిమ్మాపూర్, పద్మనాభంపల్లి, మర్రికుంట, అందె, కొండాపూర్, గుడికందుల, వెంకటాపూర్, బుస్సాపూర్, వరదరాజ్‌పల్లి, గోవర్ధనగిరి, ఘనపూర్ గ్రామాల్లో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం దుబ్బాక నియోజకవర్గ రైతులు తమ భూములతోపాటు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, తిమ్మాపూర్ మాజీ ఎంపీటీసీ మాధవి, బీఆర్ఎస్, రైతు సంఘా ల నాయకులు ఎల్లారెడ్డి, అంజిరెడ్డి, రాంరెడ్డి, బండి రాజు, కమలాకర్‌రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.