దుబ్బాక, మార్చి 10: కాంగ్రెస్ పాలన రైతులకు పెనుశాపంగా మారిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీడు భూములను సస్యశ్యామలంగా మార్చిన ఘనత కేసీఆర్ సర్కారుకు దక్కితే, కాంగ్రెస్ పాలనలో సాగునీళ్ల కోసం అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకునే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం దుబ్బాక మండలంలోని కమ్మర్పల్లి, అచ్చుమాయిపల్లి శివారులో నిర్మాణ దశలో ఉన్న మల్లన్నసాగర్ 4ఎల్ డిస్ట్రిబ్యూటర్ ఉప కాల్వల పనులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ అంటేనే ప్రజలను కష్టాలు పెట్టే ప్రభుత్వమని విమర్శించారు.
రైతులకు సాగునీటి కష్టాలు తొలిగించేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు సరఫరా చేయకుండా రైతులను కన్నీళ్లు పెట్టిస్తుందని దుయ్యబట్టారు. దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా రైతులు సాగునీటి సమస్య ఎదుర్కోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలకు సాగునీరు అందడంలేదన్నారు. 4 ఎల్ డిస్ట్రిబ్యూటర్‌తో పాటు మరికొన్ని ఉప కాల్వల నిర్మాణం చేపట్టకపోవడంతో రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. సుమారు 30 గ్రామాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.
నీటిపారుదల శాఖ మంత్రి స్పందించి సంబంధిత అధికారులతో, కలెక్టర్‌తో మాట్సాడి సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. అచ్చుమాయిపల్లిలో 4ఎల్ డిస్ట్రిబ్యూటర్ నిర్మాణ పనులు నత్తనడకనసాగడంతో గ్రామానికి చెందిన రైతులు కొంత డబ్బులు పొగేసుకుని కాల్వ పనులు చేపట్టారు. కాల్వ ల్లో బండరాళ్లను తొలిగించేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో రైతులు సొంత డబ్బులతో బండరాళ్లను పగులకొట్టించారు. రైతులే జేసీబీలతో తవ్వకాలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఈ విషయంపై 4ఎల్ డిస్ట్రిబ్యూటర్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పని చేస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంపాదన దోచుకుంటుందని మండిపడ్డారు.
కాల్వల పక్కనే ఎండిన పొలాలను చూసి ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఎండిన వరి పంటను ఎమ్మెల్యేకు చూపిస్తూ గోడువెల్లబోసుకున్నారు. అచ్చుమాయిపల్లికి చెందిన రైతు సోమారపు నారాయణ రెండెకరాల భూమిలో మూడు నెలల్లో 6 బోర్లు తవ్వించిన చుక్కనీరు పడలేదంటూ ఎమ్మెల్యే ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నాడు.
పంట పెట్టుబడితోపాటు బోర్లు తవ్వించినందుకు రూ.2.5 లక్షలు నష్టపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వేసిన పంట మొత్తం ఎండిపోయిందని, ఎమ్మెల్యేకు చూపించి గోడు వెల్లబోసుకున్నాడు. నారాయణతో పాటు గ్రామంలో చాలామంది రైతుల పంటలు ఎండిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతుందని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు రొట్టే రాజమౌళి, కిషన్‌రెడ్డి. భూంరెడ్డి, బండి రాజు, సంజీవ్‌రెడ్డి, ఎల్లం, స్వామి, రాంరెడ్డి తదితరులున్నారు.