దుబ్బాక, ఆగస్టు 31: ఇటీవల కురిసిన వర్షం, వరదల కారణంగా గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని, నిధులు కేటాయించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడారు. వరదల వల్ల గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లో నష్టం జరిగిందని ప్రభుత్వానికి విన్నవించారు. ఈవిషయంపై జిల్లా అధికారులకు విన్నవిస్తే నిధులు లేవని సమాధానం ఇస్తున్నారని తెలిపారు.
కనీసం తాత్కాలికంగా మరమ్మతు పనులు చేపట్టాలని సంబంధిత కలెక్టర్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, విద్యుత్ అధికారులను కోరితే నిధులు లేవంటున్నారని గుర్తుచేశారు. వరదల వల్ల గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయని, వాటిని పునరుద్ధ్దరించేందుకు నిధులు కేటాయించి, సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ పనులకు నిధులు కేటాయించి, వాటిపై సంబంధిత మంత్రులు సమగ్రమైన సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.