దుబ్బాక, జనవరి 11: రాష్ట్రంలో రెండేండ్ల కాంగ్రెస్ పాలన… ‘కొత్త సీసాలో పాత సారాగా’ మారిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సర్కారులో దుబ్బాక మున్సిపల్‌కు మంజూరైన టీయూఎఫ్ఐడీసీ నిధులను ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రైజింగ్ నగర అభివృద్ధి (అర్బన్ డెవలప్మెంట్ )పేరుతో ఆర్భాటం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ దుబ్బాక కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక మున్సిపాలిటీకి బీఆర్ఎస్ ప్రభుత్వం టీయూఎఫ్ఐడీసీ కింద రూ.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇందులో రూ. 2 కోట్లతో టౌన్‌హాల్, రూ.3 కోట్లతో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌కు, ఒక్కో వార్డుకు రూ.50 లక్షల చొప్పున మొత్తం 20 వార్డులకు రూ.10 కోట్లు కేటాయించామన్నారు.
అప్పట్లో మంజూరైన నిధులను కాంగ్రెస్ ఎన్నికల కోడ్ పేరుతో అడ్డుకుందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కారు దుబ్బాకపై కక్షపూరితంగా వ్యవహరించి మంజూరైన రూ.15 కోట్లను రద్దు చేసిందన్నారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా మంజూరైన రూ.15 కోట్లకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు టెండర్లు జరిగినప్పటికీ వాటిని కాంగ్రెస్ సర్కారు రద్దు చేయడం బాధాకరమన్నారు. రేవంత్‌రెడ్డి రెండేండ్లలో దుబ్బాక మున్సిపాలిటీకి నయా పైసా నిధులు మంజూరు చేయలేదన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాగానే కాంగ్రెస్ సర్కారు కొత్త నాటకం మొదలు పెట్టిందని విమర్శించారు. రెండేండ్ల కిందట దుబ్బాక మున్సిపల్‌కు మంజూరైన రూ.15 కోట్లను ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అర్బన్ డెవలప్మెంట్ పేరుతో మళ్లీ ఆనిధులనే తిరిగి మంజూరు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు అభివృద్ధి పేరిట ప్రజల వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కారులో మంజూరైన నిధులతో ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు ప్రారంభోత్సవాల పేరుతో పరుగులు పెడుతున్నారని ఆరోపించారు. దుబ్బాక మున్సిపల్లో మంగళవారం పలు ప్రారంభోత్సవాలకు జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రెండేండ్లలో మున్సిపాలిటీకి ఒక్క పైసా మంజూరు చేయకుండా బీఆర్ఎస్ హయాంలో మంజూరైన నిధులతో రెండేండ్ల తర్వాత ఇప్పుడు ప్రారంభోత్సవం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దుబ్బాక మున్సిపల్లో బీఆర్ఎస్ సర్కారులో జరిగిన అభివృద్ధే కనబడుతుందన్నారు.
దుబ్బాకలో అధికంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించుకున్నామని, వంద పడకల దవాఖాన, కేసీఆర్ బడి, అధునాతన బస్టాండ్, బస్తీ దవాఖాన భవనాలు, అన్ని కుల సంఘాలకు పక్కా భవనాల నిర్మాణంతో పాటు మున్సిపల్లో 20 వార్డులకు రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. దుబ్బాకకు వస్తున్న మంత్రి కొత్తగా ఎన్ని నిధులు మంజూరు చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కారులో మంజూరైన నిధులు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దుబ్బాకలో ఎన్ని నిధులతో ఎంత అభివృద్ధి చేయనున్నదో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, ఎల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, పల్లె వంశీగౌడ్,బండి రాజు, శ్రీనివాస్, ఆస యాదగిరి, రామస్వామిగౌడ్, బీమసేన, దేవరాజ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.