దుబ్బాక, జూన్ 24: కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం సిద్దిపేట మండలం దుబ్బాకలో నీలకంఠ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణ సమూదాయాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన పరిశీలించారు. భవనానికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కుల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ..బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేవడం లేదన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత భారీగా పెరిగిందని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మండలంలోని పద్మనాభునిపల్లి- తిమ్మాపూర్ ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిపివేయడంతో రెండు గ్రామాల ప్రజలకు సమస్యగా మారిందని సర్పంచ్‌లు ఎమ్మెల్యేకు విన్నవించారు. వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిగా చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.
ఆశీస్సులతో దుబ్బాక నియోజకవర్గం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆకాక్షించారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పించేందుకు దుబ్బాక వ్యాపారులు ముందుకొచ్చి, దక్షిణాది అమర్నాథ్ సేవా సమితి పేరిట దుబ్బాక నుంచి తొలిసారిగా అన్న ప్రసాద సామగ్రిని తరలించడంపై ఎమ్మెల్యే అభినందించారు. దుబ్బాకలోని బాలాజీ ఆలయంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. శివపార్వతుల కల్యాణోత్సవంలో పాల్గొని, అమర్నాథ్ యాత్ర అన్నప్రసాద సామగ్రిని తరలించారు. అమర్నాథ్లో లంగర్ ఏర్పాటుకు తాను ఎంపీగా ఉన్న సమయంలో కృషి చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో అఖిల భారత హనుమాన్ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్, బాలాజీ ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, దక్షిణాది అమర్నాథ్ సేవా సమితి అధ్యక్షుడు నేతి కైలాసం, కార్యదర్శి పరమేశ్వర్, కోశాధికారి చింత రాజు, పీఆర్వో రమేశ్, సభ్యులు నల్లా శ్రీనివాస్, రొట్టె రాజమౌళి, కూర వేణు, పోలీసు రాజు, యాదగిరి, చంద్రం, శ్రీకాంత్, ఆంజనేయులు , మున్సిపల్ వైస్ చైర్మన్ ఆస సులోచన స్వామి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.