దుబ్బాక, మార్చి 17 : సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, తలాపునా మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా దుబ్బాక నియోజకవర్గం రైతులు సాగునీటి కష్టాలు పడుతున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సోమవారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి విన్నవించారు. సోమవారం అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌ను ఆయన కలిసి తన నియోజకవర్గంలోని సాగునీటి సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.
ఈ విషయంపై ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో ఫోన్లో మాట్లాడుతూ…మల్లన్నసాగర్ నుంచి 300 క్యూసెక్కుల నీరు కూడవెల్లి వాగులోకి విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. దీనికి మంత్రి స్పందించి, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి కూడవెల్లి వాగుకు నీరు విడుదల చేస్తున్నందున వాగు పరిసర గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. రామాయంపేట, చిన్నశంకరంపేట , దుబ్బాక మండలాల్లో నిలిచిపోయిన ఉప కాల్వల నిర్మాణ పనులు పూర్తిచేయాలని మంత్రి కోరినట్లు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.