జహీరాబాద్, ఏప్రిల్ 24: మోసపూరిత పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌పై ప్రజలు విరక్తి చెందారని, మళ్లీ అధికారంలోకి కేసీఆర్ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తథ్యమని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు, అనేక హామీలిచ్చి ఒక్కటి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, కాంగ్రెస్ పాలనలో మళ్లీ పదేండ్లు వెనక్కి పోయామని ప్రజలు అవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని, ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులతో పాటు నాయకులు, అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి 4వేల మంది వెళ్లేందుకు ఏర్పా ట్లు చేసినట్లు చెప్పారు. 30 బస్సులు, 100 జీపులు, 100 ఇతర వాహనాల్లో పార్టీ శ్రేణు లు తరలివెళ్తారని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు తెలిపారు.
చిన్నశంకరంపేట, ఏప్రిల్ 24 : ఈనెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం చిన్నశంకరంపేటలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వరంగల్ సభకు అంచనాలకు మించి ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధ్దమవుతున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సొంత ఖర్చులతో వాహనాలను ఏర్పాటు చేసుకొని సభకు వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారని, మరికొంతమంది పాదయాత్రగా వరంగల్ సభకు తరలివెళ్తున్నట్లు చెప్పారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాలను మోసం చేసిందన్నారు. మహిళలకు ప్రతినెలా రూ. 2500 ఇస్తామని మోసం చేసిందన్నారు. రూ. 4000 ఆసరా పింఛన్ ఏమైందని ఆమె ప్రశ్నించారు. రైతులకు రెండు లక్షల పంట రుణమాఫీ అసంపూర్తిగా చేసిందని విమర్శించారు. తిరిగి బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, జిల్లా నాయకుడు లక్ష్మారెడ్డి, చైర్మన్ అంజిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు కుమార్‌గౌడ్, లక్ష్మణ్, పోచయ్య, నాయకులు శ్రీను, సుధాకర్, లాలునాయక్, రమేశ్, హేమచంద్రన్, నాగరాజు, నరేశ్, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.