జహీరాబాద్, ఏప్రిల్ 3: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తట్టు నారాయణ ఆధ్వర్యంలో మండలంలోని మధులైతండా పంచాయతీ ఉప సర్పం చ్ ప్రేమ్రాథోడ్, నాయకులు జైసింగ్, రవి, ఏక్నాథ్, సంతోష్, కృష్ణ, జైపాల్, ధన్‌రాజ్, నాగేందర్, రాజా, వెంకట్, మనోజ్‌తో పాటు కార్యకర్తలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
వారందరికీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి వందరోజుల్లోనే అమలు చేస్తామని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత వాటి ని అటకెక్కించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 26 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. పథకాల అమలు తక్కువ ప్రచారం ఎక్కువ అన్న తీరుగా కాంగ్రెస్ పాలన సాగుతున్నదన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రతి మహిళకు రూ. 2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. దివ్యాంగుల పింఛన్ రూ. 6వేలు, వృద్థులు, బీడీ కార్మికులకు పింఛన్ రూ. 4 వేలు పెంచలేదని మండిపడ్డారు.
బడ్జెట్లో పింఛన్ల పెంపు ఊసే లేదన్నారు. రైతుభరోసా కింద రూ.15 వేల పెట్టుబడి, కౌలు రైతులకు రూ.15వేల సహాయంతో పాటు పంటరుణమాఫీ, జాబ్ క్యాలెండర్, 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు స్కూటీ వంటి హామీల ఊసేలో లేదన్నారు. కేసీఆర్ పాలనలో తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తండాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు హీరురాథోడ్, అమిత్‌కుమార్, వహీద్‌అలీ, చిన్నారెడ్డి, జగదీశ్, పర్వేజ్, గులాబ్‌సింగ్, రాజు, పుండ్లిక్ పవార్, దేవిదాస్, పవన్రాథోడ్, మేఘనాథ్ పాల్గొన్నారు.