జహీరాబాద్, ఏప్రిల్ 10: ఆరు గ్యారెంటీలు, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలును విస్మరించిందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆరోపించారు. గురువారం జహీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని, సాధించిన తెలంగాణను అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇమేజ్ను దెబ్బతిస్తున్నదని, అన్నిరంగాల్లో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. రైతు భరోసా, పంట రుణమాఫీ, రైతుబీమా పథకాలకు తిలోదకాలు ఇచ్చిందని ధ్వజమెత్తారు. వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జహీరాబాద్ నియోజకవర్గం నుంచి 5వేలకు పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఇంటి పండుగలా భావించి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు,అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణ, పీఎసీఎస్ చైర్మన్ మచ్చేందర్, నాయకులు గుండప్ప, విజయ్‌కుమార్, రవికిరణ్, యాకూబ్, భాస్కర్, మోహిజొద్దీన్, నర్సింలుగౌడ్, మోహన్, అబ్దుల్ల్లా, మిథున్‌రాజ్, గణేశ్, చంద్రయ్య పాల్గొన్నారు.