చేర్యాల, జనవరి 18: కొమురవెల్లి మల్లికార్జున స్వామి పట్నం వారానికి పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. శనివారం మల్లన్న క్షేత్రంలో ఆమె పర్యటించారు. దర్శన ప్రదేశాలు, వీఐపీ, జనరల్ పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి బందోబస్తు విధులపై దిశానిర్దేశం చేశారు. దర్శనానికి వచ్చే భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, సమస్యలు వస్తే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. రోడ్లపై వాహనాలు నిలుపకుండా చూడాలని, పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపేలా చర్యలు చేపట్టాలన్నారు. దొంగతనాలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
బందోబస్తును రెండు సెక్టార్లుగా విభజించామని, టెంపుల్ ఆవరణ చుట్టుపక్కల దర్శన ప్రదేశాలు, తోటబావి, పట్నం వేసే ప్రదేశం, పార్కింగ్ ప్రదేశాలను రెండు సెక్టార్లుగా విభజించామని తెలిపారు. మల్లన్న క్షేత్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రతి ప్రభుత్వశాఖకు చెందిన వారు కంట్రోల్ రూమ్లో అందుబాటులో ఉండి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీఐపీ దర్శనం, శ్రీఘ్ర దర్శనం, సాధారణ దర్శనం మూడు విభాగాలుగా విభజించామని, కల్యాణ వేదిక పట్నం వేయనుండడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. పార్కింగ్, టెంపుల ఆవరణలో 80 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని, ఇద్దరు అడిషనల్ డీసీపీలు, 4 ఏసీపీలు, 14 మంది సీఐలు, 28 మంది ఎస్ఐలతో పాటు 510 మంది సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలిపారు.
తోటబావి సమీపంలో ఎడమవైపు ఖాళీగా ఉన్న ప్రహరీ ప్రదేశంలో వీఐపీ పార్కింగ్, చేర్యాల, కిష్టంపేట, సిద్దిపేట, కొమురవెల్లి కమాన్ నుంచి వచ్చే వాహనదారులు కొమురవెల్లి బస్టాండ్ పక్క ఉన్న ఖాళీ ప్రదేశంలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలన్నారు. హైదరాబాద్, ప్రజ్ఞాపూర్, కొడకండ్ల, చిన్నకిష్టాపూర్, కొండపోచమ్మ టెంపుల్ నుంచి వచ్చే వాహనదారులకు పెట్రోల్ పంపు వెనుక ప్రదేశంలో పద్మశాలి నిత్య కల్యాణ సత్రం ఎడమ వైపు ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్కింగ్ ప్రదేశాల్లో తప్ప ఇతర ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేయవద్దని, టెంపుల్ ఆవరణలోకి వాహనాలు అనుమతి లేదని సీపీ తెలిపారు. అనంతరం పోలీస్స్టేషన్ సందర్శించి టెంపుల్ అవరణ, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీను, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, కొమురవెల్లి ఎస్ఐ రాజు పాల్గొన్నారు.